ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల
సంఘం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం టౌన్
డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు
జారీ చేసింది.
టీడీపీ నేతల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఈసీ,
ఈ చర్యలు చేపట్టింది. అనంతపురం టౌన్ లో తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని
టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. మూడేళ్ళగా అనంతపురం టౌన్ లో డీఎస్సీ వీరరాఘవరెడ్డి
తమ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో టీడీపీ పేర్కొంది.
నాన్ బెయిలబుల్ కేసులు పెడుతూ టీడీపీ జిల్లా నేతలను
జైలు పాలు చేశారని ఫిర్యాదులో తెలిపారు.
ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్నికల
సంఘం.. డీఎస్పీ వీరరాఘవరెడ్డిని బదిలీ చేయాలని డీజీపీని ఆదేశించింది.
అన్నమయ్య జిల్లా రాయచోటీ డీఎస్పీ సయ్యద్
మహబూబ్ బాషా నూ బదిలీ చేశారు. తమ సబార్డినేట్స్ కు ఛార్జ్ అప్పగించి విధుల నుంచి రిలీవ్
కావాలని మెమోరాండంలో డీజీపీ స్పష్టం
చేశారు.