చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్
జరుగుతోంది. మాజీ
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ నియోజకవర్గం నుంచి గతంలో శాసనసభకు పలుమార్లు
ప్రాతినిధ్యం వహించారు.
ప్రస్తుతం
టీడీపీ నుంచి
బీజేపీ, జనసేన మద్దతుతో మద్దులూరి మాలకొండయ్య యాదవ్, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే
కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమెల్యే ఆమంచి కృష్ణమోహన్
బరిలో ఉన్నారు.
కరణం బలరాం గత ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి ఆ
తర్వాత వైసీపీకి మద్దతు తెలిపారు. దీంతో ఈ సారి ఆయన కుమారుడు కరణం వెంకటేశ్ కు
వైసీపీ టికెట్ కేటాయించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమంచి కృష్ణ మోహన్,
వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. హస్తం గుర్తుపై పోటీలో నిలిచారు.
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య శిష్యుడిగా రాజకీయ
అరంగేట్రం చేసిన ఆమంచి కృష్ణ మోహన్ ఓ సారి హస్తం గుర్తుపై మరోసారి స్వతంత్ర
అభ్యర్థిగా చీరాలలో విజయం సాధించారు.
ఆమంచి కృష్ణ మోహన్ గతంలో ఈ నియోజకవర్గం నుంచి రెండు
సార్లు గెలిచి ఉండటానికి తోడు అభిమానులు, చుట్టరికం, బంధుగణం పెద్దసంఖ్యలో
నియోజకవర్గంలో ఉన్నారు. దీంతో ఆయన పోటీతో చీరాల రాజకీయం రసవత్తరంగా మారింది.
2004లో ఈ నియోజకవర్గం
నుంచి కొణిజేటి రోశయ్య టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై విజయం సాధించారు. ఆ
తర్వాత వైఎస్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2009లో మాత్రం రోశయ్య
ఎమ్మెల్సీగా నామినేట్ కాగా ఆమంచి బరిలో
నిలిచారు. టీడీపీ అభ్యర్థి జంజనం శ్రీనివాసరావుపై 11 వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు.
2004లో సైకిల్ గుర్తుపై పోటీ చేసిన పాలేటి రామారావుకు 2009లో టీడీపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన
ప్రజారాజ్య పార్టీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
2014 లో టీడీపీ నుంచి
పోతుల సునీత పోటీ చేయగా ఆమె పై ఆమంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. ఇక 2019 లో సైకిల్ గుర్తుపై కరణం
బలరాం పోటీ చేయగా, ఫ్యాన్ గుర్తుపై ఆమంచి కృష్ణ మోహన్ బరిలో నిలిచారు. 17 వేల ఓట్ల
మెజారిటీతో విజయం సాధించిన కరణం బలరాం ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వానికి అనధికారికంగా
మద్దతు ప్రకటించారు. దీంతో చీరాల వైసీపీలో ఆధిపత్య పోరు మొదలైంది. సర్దుబాటు చర్యల్లో
భాగంగా ఆమంచిని పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా నియమించింది. కానీ ఆయన ఆ పార్టీకి
రాజీనామా చేసి హస్తం గుర్తుపై చీరాల నుంచి పోటీలో ఉన్నారు.