ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లో అద్దంకి నియోజకవర్గ తీర్పు భిన్నంగా ఉంటుంది.
2019లో వైసీపీ హవాలోనూ టీడీపీ విజయం సాధించిన అతి తక్కువ నియోజకవర్గాల్లో ఈ అసెంబ్లీ స్థానం కూడా ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్, వైసీపీ
నుంచి పాణెం చిన్న హనమిరెడ్డి తలపడుతున్నారు.
టీడీపీ
నుంచి బరిలోకి దిగుతున్న గొట్టిపాటి రవికుమార్ , కమ్మ సామాజికవర్గానికి చెందిన
నేత. వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికైన చరిత్ర ఆయనది.
2014లో
వైసీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్,
టీడీపీ అభ్యర్థి కరణం వెంకటేశ్ పై సుమారు నాలుగు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
2019 లో మాత్రం వైసీపీ ని వీడి టీడీపీ లో చేరారు. వైసీపీ గాలిలోనూ ఆయన అద్దంకిలో
12 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పటికీ ఆ
పార్టీకి కేవలం నాలుగు వేల ఓట్లు మాత్రమే పడ్డాయి.
2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి
మార్టురు శాసనసభ నుంచి విజయం సాధించిన రవికుమార్, 2009లో హస్తం గుర్తుపై అద్దంకిలో
పోటీ చేసి కరణం బలరామ్(టీడీపీ )ను ఓడించారు. 2009లో ఈ స్థానంలో పోటీ చేసిన ప్రజారాజ్యం
అభ్యర్థికి సుమారు 11 వేల ఓట్లు వచ్చాయి.
వైసీపీ
నుంచి పోటీ చేస్తున్న పాణెం చిన్న హనిమిరెడ్డి చివరి నిమిషంలో అభ్యర్థిగా
ఎంపికయ్యారు. గతంలో పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం సమన్వయకర్తగా
పనిచేశారు.
ఈ నియోజకవర్గంలో
కమ్మ, బీసీ, ఎస్సీ సామాజికవర్గాల ఓట్లు కీలకం కాగా, అద్దంకి, కొరిశపాడు,
బల్లికురవ, ముండ్లమూరు, సంతమాగులూరు మండలాలు ఉన్నాయి.
నియోజకవర్గ
వ్యాప్తంగా పేరున్న కృష్ణ చైతన్య ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో ఇక్కడ
వైసీపీకి కొంతమేర నష్టం జరగవచ్చు అని
విశ్లేషణలు జరుగుతున్నాయి.