గుంటూరు పేరు చెబితే కారం గుర్తుకు వస్తుంది. గుంటూరు కారం ఎంత ఘాటో, అక్కడ రాజకీయాలు కూడా హాట్ హాట్‌గా ఉంటాయి. 1952లో ఏర్పడిన గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎందరో మహామహులు పార్లమెంటులో అడుగుపెట్టారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు నియోజకవర్గాలున్నాయి.
1952లో గుంటూరు నుంచి ఎస్వీఎల్ నరసింహం స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 1957, 1962, 1967, 1971, 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొత్త రఘురామయ్య వరుస విజయాలు అందుకున్నారు. 1980, 1984, 1989లో కాంగ్రెస్ నేత ఎన్‌జీ రంగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 1991లో టీడీపీ అభ్యర్థి ఎస్.ఎం.లాల్‌జాన్ బాషా, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి రాయపాటి సాంబశివరావు, 1999లో టీడీపీ నుంచి యంపరాల వెంకటేశ్వరరావు, 2004, 2009లో రాయపాటి సాంబశివరావు, 2014, 2019లో రెండుసార్లు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విజయం సాధించారు.
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం ఎంతోమంది ఉద్దండులను పార్లమెంటుకు పంపింది. ఇక్కడ నుంచి ఐదుసార్లు విజయం సాధించిన కొత్త రఘురామయ్య కేంద్ర మంత్రిగా సేవలందించారు. అనేక విద్యా సంస్థలను స్థాపించారు.కాంగ్రెస్ నుంచి రాయపాటి సాంబశివరావు నాలుగుసార్లు గెలిచినా ఆయన కేంద్ర మంత్రి పదవి మాత్రం అందుకోలేకపోయారు.
ప్రస్తుతం అక్కడ టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్, వైసీపీ నుంచి కిలారి వెంకట రోశయ్య, సీపీఐ నుంచి జంగాల అజయ్ కుమార్ బరిలో నిలిచారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లోని అత్యధిక ధనవంతుల్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా నిలిచారు. ఇక 2019లో పొన్నూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచిన కిలారి వెంకట రోశయ్య, ప్రస్తుతం గుంటూరు లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.