బాపట్ల
అసెంబ్లీ నియోజకవర్గంలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్షాలు క్షణం తీరిక లేకుండా
వ్యూహా ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ
నియోజకవర్గంలో రెండు దఫాలుగా వైసీపీ జెండా రెపరెపలాడుతోంది.
హ్యాట్రిక్
కోసం వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోగా, పారిశ్రామికవేత్త,
నియోజకవర్గంలో విరివిగా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేగేశ్న నరేంద్రకుమార్
కు టీడీపీ టికెట్ ఇచ్చింది. టీడీపీలో చేరిందే తడవుగా ఆయన ఇంటింటికి తిరిగి తనను గెలిపించాలని
బాపట్ల వాసులను కోరుతున్నారు.
నియోజకవర్గంలో
రాజకీయంగా రెడ్డి సామాజికవర్గ ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ టీడీపీ, వైసీపీ ల
టికెట్ మాత్రం వారికి దక్కలేదు.
గడిచిన
రెండు దఫాలుగా ఫ్యాన్ గుర్తుపై విజయం సాధించిన కోన రఘుపతి, వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ
స్పీకర్ గా పనిచేశారు. అయితే ఆయనకు మంత్రి
పదవి దక్కకపోవడంపై బాపట్ల ఓటర్లతో పాటు అభిమానులు నిరాశ చెందారు. తండ్రి నుంచి రాజకీయ
వారసత్వం అందుకున్న కోన రఘుపతి వివాద రహిత రాజకీయ నేతగా ఉండేందుకు ఇష్టపడతారు.
కోన
రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు, బాపట్ల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
గవర్నర్ గా కూడా సేవలందించారు. 1967, 1972, 1978లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మాజీ
మంత్రి గాదె వెంకటరెడ్డి వారసుడిగా మధుసూదన రెడ్డి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసేందుకు
ప్రయత్నించారు. కానీ అధిష్టానం కోన వైపే మొగ్గు చూపింది. బాపట్ల ప్రాంతంలోని
బ్రాహ్మణ ఓట్ల మద్దతు కోసం మళ్ళీ ఆయననే బరిలోకి దింపింది. అసమ్మతినేతల వాదనను
తోసిపుచ్చింది.
2014,
2019లో సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఓడిన అన్నం ప్రభాకర్, టీడీపీని వీడటం ఆ పార్టీకి
పూడ్చలేని లోటు అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 2019లో ఓటమి తర్వాత ఆయన
టీడీపీని వీడి బీజేపీలో చేరారు. కమలం గుర్తుపై అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం
జరిగింది. కానీ పొత్తులో భాగంగా టీడీపీ ఇక్కడ పోటీలో ఉంది.
స్థానికుల
చిరకాల వాంఛ అయిన బాపట్ల జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో వైసీపీ కి కలిసి
వచ్చే అంశం. దీనికి తోడు వైద్య కళశాల, బైపాస్ రోడ్డు నిర్మాణం, వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బ్యాలెట్
పోరులో కీలకంగా మారనున్నాయి.
టీడీపీ,
జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటం, టీడీపీ వాగ్దానాలైన సూపర్ సిక్స్ పథకాలతో ఈ సారి ఆ పార్టీ విజయావకాశాలు
పెరిగాయనే వాదన కూడా ఉంది.