Congress Puri Candidate Drops Out For Lack Of Funds
కాంగ్రెస్ పార్టీకి మరో చేదు అనుభవం ఎదురైంది. ఆ
పార్టీ అభ్యర్ధిగా ఎంపిక చేసుకున్న వ్యక్తి, నిధు లేవంటూ పోటీ నుంచి తప్పుకున్నారు.
దీనితో ఇప్పటికి ఆ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్ధులు ఎన్నికల బరిలోనుంచి వైదొలగినట్లయింది.
ఒడిషాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గానికి
కాంగ్రెస్ పార్టీ సుచరితా మొహంతిని అభ్యర్ధిగా ఎంపిక చేసింది. సుచరిత గతంలో
పాత్రికేయురాలు. పదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రచారానికి నిధులు సమకూర్చబోమని,
అభ్యర్ధే డబ్బులు పెట్టుకోవాలనీ ఒడిషా కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అజొయ్ కుమార్ తేల్చి
చెప్పేయడంతో తానింక ఎన్నికల బరిలో ఉండలేనంటూ సుచరిత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌లకు రాసిన లేఖలో వెల్లడించారు.
‘‘పూరీలో విజయావకాశాలు బాగున్నాయి. అయినా నిధుల
లేమి వల్ల ప్రచారం చేయలేకపోతున్నాను. నేను గతంలో జర్నలిస్టుగా ఉన్నప్పుడు జీతంగా
సంపాదించి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చుపెట్టేసాను. ప్రజల నుంచి విరాళాలు సేకరించడానికి
కూడా ప్రయత్నించాను, కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. వీలైనంతవరకూ నా ప్రచారాన్ని
సైతం తగ్గించుకున్నాను. పార్టీ ఫండింగ్ లేకుండా ప్రచారం కొనసాగించలేను. అందువల్ల,
కాంగ్రెస్ టికెట్‌ను వెనక్కి ఇచ్చేస్తున్నాను’’ అని సుచరితా మొహంతి తన లేఖలో
రాసుకొచ్చారు.
తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయురాలైన
కార్యకర్తగానే ఉంటానని, అయితే పార్టీ తనకు ప్రచారానికి ఎలాంటి నిధులూ ఇవ్వడం
లేనందునే ఈ చర్య తీసుకోవలసి వచ్చిందనీ సుచరిత తన లేఖలో వివరించారు.
పూరీ ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు
అభ్యర్ధుల ఎంపిక విషయంలోనూ సుచరిత అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్ధులను
మార్చమని ఆమె అడిగినా అధిష్ఠానం పట్టించుకోలేదు.
పూరీ లోక్‌సభ నియోజకవర్గానికి మే 25న పోలింగ్
జరగనుంది. అక్కడ నామినేషన్లు దాఖలు చేయడానికి మే 6 ఆఖరు తేదీ. ఈ సమయంలో సుచరిత
నిర్ణయం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే.
కాంగ్రెస్ ఇప్పటికే
సూరత్, ఇండోర్ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను పోగొట్టుకుంది. సూరత్‌లో కాంగ్రెస్
అభ్యర్ధి నీలేష్ కుంభానీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవడంతో ఆ స్థానంలో బీజేపీ
అభ్యర్ధి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇండోర్‌లో కాంగ్రెస్ తమ అభ్యర్ధిగా
ప్రకటించిన అక్షయ్ బామ్, నామినేషన్ వేయకుండా ఆగిపోయి, బీజేపీలో చేరారు.