రేపల్లె
నుంచి పలువురు ప్రముఖులు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర రాజకీయాల్లో
చెరగని ముద్రవేశారు. మోటూరు హనుమంతరావు, మాకినేని బసవపున్నయ్య, కొరటాల సత్యనారాయణ,
యడ్ల వెంకటరావు, యాదం చెన్నయ్య, ముమ్మనేని వెంకటసుబ్బయ్య, దేవినేని మల్లికార్జునరావు
వంటి దిగ్గజాలు ఇక్కడి నుంచే రాజకీయాలు నెరిపారు.
బాపట్ల
పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రేపల్లె అసెంబ్లీ స్థానంలో గడిచిన రెండు దఫాలుగా
తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ సారి కూడా సైకిల్ గుర్తుపై సిట్టింగ్
ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పోటీ చేస్తున్నారు.
2009లో
కాంగ్రెస్ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ చేతిలో ఓడిన అనగాని సత్యప్రసాద్, 2014, 2019లో అదే అభ్యర్థిపై వరుస విజయాలు
సాధించారు.
2009లో హస్తం గుర్తుపై గెలిచిన మోపిదేవి కాంగ్రెస్ ప్రభుత్వంలో
మంత్రిగా పనిచేశారు. వాన్‌పిక్ కేసులో
అరెస్టు అయి జైలు జీవితం కూడా గడిపారు. వైసీపీ ఏర్పాటు తర్వాత ఆ పార్టీలో చేరి
ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి పరాజయం చెందారు. కానీ తర్వాత జగన్ ప్రభుత్వం మంత్రిగాను
కొన్నాళ్లు పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ
తరఫున రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వైసీపీ
అధినేత జగన్ కు సన్నిహితుడిగా పేరున్నప్పటికీ నియోజకవర్గంలో మోపిదేవి విజయం
సాధించలేకపోయారు. దీంతో ప్రస్తుతం వైసీపీ టికెట్ ఈవూరు గణేశ్ ను వరించింది. గణేశ్
2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు.
సత్యప్రసాద్,
గణేశ్ ఇద్దరూ బీసీ సామాజికవర్గానికి చెందినవారే. మత్స్యకారులు, బీసీలే
నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది.
కాంగ్రెస్
పార్టీ నుంచి మోపిదేవి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. 2019లో జనసేన తరఫున పోటీ
చేసిన కమతం సాంబశివరావుకు 11 వేల పై చిలుకు ఓట్లు పడ్డాయి.
1989లో
రేపల్లె నుంచి హస్తం గుర్తుపై అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ
అభ్యర్థి ముమ్మనేని వెంకటసుబ్బయ్యపై ఆయన విజయం సాధించారు. అంబటి రాంబాబు ప్రస్తుతం
జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉండగా, సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ
చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే
గెలిపిస్తాయని ఆ పార్టీ అభ్యర్థి చెబుతుండగా, హ్యాట్రిక్ ఖాయమని టీడీపీ ధీమా
వ్యక్తం చెస్తోంది.