గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఇక్కడ 200065 మంది ఓటర్లున్నారు. తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, పిరంగిపురం మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
1967, 1972లో వరుసగా రెండు సార్లు తాడికొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గద్దే వెంకట రామయ్య గెలుపొందారు.
1978లో తమనపల్లి అమృతరావు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1983, 1985, 1999లో జెఆర్ పుష్పరాజ్ టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. పుష్పరాజ్ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి తిరువలపాటి వెంకయ్య, 1994లో సీపీఐ అభ్యర్థి జీఎంఎన్వీ ప్రసాద్ విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్ నుంచి గెలిచి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు.2014లో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ విజయం సాధించారు. ఇక 2019లో వైసీపీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. తరవాత కాలంలో ఆమె టీడీపీలో చేరిపోయారు.
ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో తాడికొండలో వైసీపీ నుంచి మాజీ హోం,మాజీ ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, టీడీపీ నుంచి తెనాలి శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి మనిచాల సుషీల్ రాజా బరిలో నిలిచారు.రైతుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడంతో అక్కడి రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గడచిన ఐదేళ్లలో అమరావతి రాజధాని అభివృద్ధిని అటకెక్కించడంతో రైతులు, కూలీలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమరావతి రాజధానికి తాడికొండ నియోజకవర్గంలోని గ్రామాల రైతులు కూడా భూములు ఇచ్చారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో రాజధాని రైతులు ఇక్కడ గెలుపోటములను నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది.