గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. వ్యవసాయం, చేనేత ప్రధానంగా సాగే ఈ నియోజకవర్గంలో 268429 మంది ఓటర్లున్నారు. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
మంగళగిరి నియోజకవర్గంలో 1952లో సీపీఐ నుంచి దర్శి లక్షయ్య విజయం సాధించారు. 1955లో కాంగ్రెస్ అభ్యర్థి మేకా కోటిరెడ్డి గెలిచారు. 1962లో సీపీఐ అభ్యర్థి వేములపాటి శ్రీకృష్ణ విజయం సాధించారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి తులబండ్ల నాగేశ్వరరావు, 1972లో సీపీఐ నుంచి వేములపల్లి శ్రీకృష్ణ రెండోసారి విజయాన్ని అందుకున్నారు. 1978లో జనతాపార్టీ అభ్యర్థి గాదె వెంకట రత్తయ్య గెలిచారు. 1983, 1985లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఎం.ఎస్.ఎస్ కోటేశ్వరరావు రెండు సార్లు గెలిచారు.
1989లో కాంగ్రెస్ అభ్యర్థి గోలి వీరాంజనేయులు, 1994లో సీపీఐ అభ్యర్థి నిమ్మగడ్డ రాంమ్మోహన్రావు, 1999, 2004లో కాంగ్రెస్ అభ్యర్థి మురుగుడు హనుమంతరావు విజయం అందుకున్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కాండ్రు కమల గెలిచారు. మహిళ మంగళగిరిలో గెలవడం ఇదే మొదటిసారి. 2014, 2019లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆ తరవాత ఆయన వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో
చేరి, వారం తిరక్కముందే మరలా వైసీపీలో చేరిపోయారు. అయితే పోటీ నుంచి తప్పుకుని రహస్య రాజకీయాలు నడుపుతున్నారు.
2024 అసెంబ్లీ బరిలో టీడీపీ నుంచి నారా లోకేశ్, వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీపడుతున్నారు. సీపీఐ నుంచి జొన్నా శివశంకర్ పోటీలో నిలిచారు.2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి నారా లోకేశ్ ఘోరంగా ఓడిపోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, లోకేశ్ రాజకీయ జీవితాన్ని నిర్ధేశించనుంది. 2019లో ఓడినా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో ఆయన ప్రజలకు చేరువయ్యారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడంతో మంగళగిరి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కూడా లోకేశ్‌కు కలసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.