గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. వ్యవసాయం ప్రధానంగా సాగే ఈ నియోజకవర్గంలో రైతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిన వారు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 228234 మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాలు ఉన్నాయి.
1952లో పొన్నూరు నుంచి సీపీఐ నేత కోలా వెంకయ్య గెలుపొందారు. 1955లో కృషికార్
లోక్‌పార్టీ అభ్యర్థి గోవాడ పరంధామయ్య విజయం సాధించారు. 1962లో కాంగ్రెస్ అభ్యర్థి నన్నపనేని వెంకట్రావు, 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఏపీ పాములయ్య గెలుపొందారు. 1972లో స్వతంత్ర అభ్యర్థి దొప్పలపూడి రంగారావు విజయం అందుకున్నారు. 1983, 1985లో దూళిపాళ్ల వీరయ్య చౌదరి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టినేని వెంకటరావు గెలుపొందారు. 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో దూళిపాళ్ల నరేంద్ర కుమార్ వరుసగా ఐదుసార్లు గెలిచి టీడీపీ అభ్యర్థి రికార్డు సృష్టించారు. 2019లో వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య గెలుపొందారు. ప్రస్తుతం ఈయన గుంటూరు వైసీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు వైసీపీ నుంచి నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీ కృష్ణ పోటీలో నిలిచారు. టీడీపీ నుంచి దూళిపాళ్ల నరేంద్ర బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి జక్కా రవీంధ్రనాథ్ కూడా సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గడచిన మూడు దశాబ్దాల్లో ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించడం నరేంద్రకు కలసి వచ్చే అంశంగా చెప్పవచ్చు.