Prajwal Revanna Scandal Impact on Third Phase Polling in Karnataka
భారతీయ జనతా పార్టీకి దక్షిణాది ముఖద్వారం కర్ణాటక.
దక్షిణ భారతదేశంలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2019
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కర్ణాటకలోని మొత్తం 28 సీట్లలో 25 స్థానాలను గెలుచుకోగలిగింది.
అలా, బీజేపీ ‘మిషన్ సౌత్’లో కర్ణాటక కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో
ఆ పార్టీ జేడీఎస్‌తో పొత్తు పెట్టుకుంది.
కర్ణాటకలో 14 స్థానాలకు ఏప్రిల్ 26న, అంటే రెండో
దశలో పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 స్థానాలకూ మే 7న, అంటే మూడో దశలో పోలింగ్
జరుగుతుంది. ఆ నియోజకవర్గాలు ఏంటంటే… చిక్కోడి, బెళగావి, బాగల్‌కోట, బిజాపూర్,
గుల్బర్గ, రాయచూర్, బీదర్, కొప్పాళ, బళ్ళారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ,
దావణగెరె, శివమొగ్గ.
మూడో దశ పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ప్రజ్వల్
రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. జేడీఎస్ అధినేత దేవెగౌడ
కుమారుడు రేవణ్ణ కొడుకే ప్రజ్వల్. ప్రస్తుతం హసన్ ఎంపీగా ఉన్నాడు. ఆ నియోజకవర్గానికి
మొదటి దశలో పోలింగ్ ముగిసిన అనంతరం విదేశాలకు వెళ్ళాడు.
తాను సొంత పనుల మీద వెళ్ళానని ప్రజ్వల్ చెబుతుంటే
తక్షణమే వెనక్కు రావాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. అతని కోసం ప్రత్యేక
దర్యాప్తు బృందం-సిట్ లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది. లైంగిక వేధింపులు,
అత్యాచారాలు, వాటి వీడియోల కేసులో చిక్కుకున్న ప్రజ్వల్ స్వదేశానికి చేరుకున్న వెంటనే,
సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుంటారు.
ప్రజ్వల్ రేవణ్ణ కేసు ప్రభావం రెండో విడత
ఎన్నికలపై ఎలా ఉంటుంది? జేడీఎస్‌కు ఈ ఎన్నికలు అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటమే.
2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ దారుణంగా ఓడిపోయింది. 224
అసెంబ్లీ స్థానాలకు గాను జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది.
అందుకే, వెంటనే ఎన్‌డిఎ కూటమిలో చేరి ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఉనికి
నిలబెట్టుకుందామని భావించింది.
జేడీఎస్ ఈ ఎన్నికల్లో మూడే స్థానాల్లో పోటీ చేసింది.
ఆ మూడింటికీ రెండో దశలో పోలింగ్ ముగిసింది. మూడో దశలో ఆ పార్టీ పోటీ చేస్తున్న
స్థానాలు లేవు. అయినప్పటికీ, ఆ పార్టీ చేతులు కలిపిన బీజేపీపై ప్రభావం
కొద్దోగొప్పో ఉండవచ్చు. దాంతో బీజేపీలో కొంత కలవరం కనిపిస్తోంది.
బీజేపీ, జేడీఎస్
ఇప్పటికే ప్రజ్వల్‌కూ తమ పార్టీలకూ సంబంధం లేదని ప్రకటించేసాయి. జేడీఎస్ ప్రజ్వల్‌ను
పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. బీజేపీ కూడా ప్రజ్వల్‌కు తాము అండగా ఉండబోమని
తేల్చి చెప్పేసింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫా ఎన్నికల కంటె ముందు ఈ
ప్రజ్వల్ రేవణ్ణపై ఎలాంటి చర్యలూ ఎందుకు తీసుకోలేదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
మే 1నాటి తన ఎన్నికల ప్రచారంలో నిలదీసారు.
‘‘మూడో దశ పోలింగ్‌లో ఎన్నికలు జరిగే ఉత్తర
కర్ణాటక ప్రాంతంలో జేడీఎస్‌కు పెద్దగా బలం లేదు. అందువల్ల ప్రజ్వల్ కేసు ప్రభావం
పెద్దగా ఉండకపోవచ్చు. సిట్ దర్యాప్తులో బలమైన సాక్ష్యాలు లభిస్తే తప్ప, బీజేపీ ఆ
వీడియోలను మార్ఫింగ్ చేయబడిన వీడియోలు అంటూ పక్కకు నెట్టేయవచ్చు. ఈ వివాదం ఏప్రిల్ 26కంటె ముందు వెలుగు చూసి ఉంటే ఆ
ప్రభావం చాలా ఎక్కువగా ఉండిఉండేది’’ అని ఓ రాజకీయ పరిశీలకుడు విశ్లేషించారు.