చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు బావను నెలకే లేపేశారు. కులపెద్దలు విధించిన జరిమానా మొత్తం, బావ చెల్లించలేదనే కసితో బావను దారుణంగా చంపేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. బావను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.
పాల్వంచ మండలం చిరుతానుపాడు గ్రామానికి చెందిన పద్దం ఉంగయ్య , గొత్తికోయకు చెందిన ఉంగీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది ఇష్టంలేని ఆమె కుటుంబ సభ్యులు, కుల పంచాయతీ పెట్టారు. పెద్దలు ఉంగయ్యకు రూ.1.50 లక్షల జరిమానా విధించారు. జరిమానా విధించిన రోజు ఉంగయ్య రూ.1.20 లక్షలు చెల్లించాడు. మిగిలిన రూ.30 వేలు ఇవ్వాలంటూ గత నెల 26న యువతి సోదరులు అడమయ్య, ఇడమయ్య…బావ ఉంగయ్య ఇంటికి వచ్చారు. డబ్బు లేదని చెప్పడంతో చెల్లిని తీసుకెళ్లారు.
ఉంగీ ఇంటి వద్ద నుంచి కనిపించకుండా పోవడంతో సోదరులు వెతుక్కుంటూ వెళ్లారు. దారిలో ఉంగయ్య కనిపించాడు. ఉంగీ ఎక్కడుందో చెప్పాలంటూ గొడవ పడ్డారు. కండువాను ఉంగయ్య మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపారు. తరవాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సమీపంలోని చెట్టుకు ఉరితీశారు.
ఉంగయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉంగీ సోదరులు పరారీలో ఉండటంతో, వారి కోసం గాలిస్తున్నారు.