Our Prime Ministers, Their Leadership and
Administration Skills – Special Series – Part 4
***********************************************************
సత్యరామప్రసాద్
కల్లూరి రచన : మనప్రధానమంత్రులు
***********************************************************
లాల్ బహదూర్
శాస్త్రి (14-10-1904 : 11-01-1966)
***********************************************************
నెహ్రూ 1964లో మరణించగా తరువాతి ప్రధానమంత్రిగా
లాల్‌బహదూర్ శాస్త్రి ఎన్నికయాడు. ఆయన ఎంతో సమర్ధుడైనా, భారతదేశపు దురదృష్టమే
అయుండాలి – ఆయన ఎక్కువ కాలం జీవించలేదు. పాకిస్తాన్‌తో మనకు యుద్ధం
సంభవించినప్పుడు ఆయన ఆధ్వర్యంలో గెలిచాము. అయితే రష్యాలోని తాష్కెంట్లో
పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో సంధి ఒప్పందం పైన సంతకం చేసిన మరునాడే ఆయన
అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ వ్యవహారం ఇప్పటికీ ఒక ‘మర్మ రహస్యమే’.
నిరాడంబర జీవనానికీ, ఉత్కృష్ట చింతనకూ ప్రతీకగా
జీవించిన లాల్‌బహదూర్ శాస్త్రి గుజరాత్–ఆనంద్‌లోని అమూల్ మిల్క్ డెయిరీ అభివృద్ధికి తోడ్పడి,
తద్వారా ‘క్షీరవిప్లవాన్ని’ బాగా ప్రోత్సహించాడు. అంతేగాక మనదేశంలో ‘హరిత విప్లవాని’కి కూడా ఆయన ప్రభుత్వం
పాటుపడింది. ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదం ఆయన సృష్టించినదే.
**********************************************************
ఇందిరా ప్రియదర్శిని
గాంధీ (19-11-1917 : 31-10-1984)
**********************************************************
ఇందిరా ప్రియదర్శిని నెహ్రూకు ఏకైక సంతానం. ఆమె
టాగోర్ శాంతినికేతన్‌లోనూ, ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ
విద్యాభ్యాసం చేసింది. (చాలామంది అనే మాట ఏమిటంటే – నెహ్రూ ఆమెను తన రాజకీయ
వారసురాలిగా తీర్చిదిద్దడానికి ఎంతగానో ప్రయత్నించాడని.) ఆమె 1938లో భారత జాతీయ కాంగ్రెస్‌లో
సభ్యురాలిగా చేరింది.
అదే పార్టీలో సభ్యుడైన ‘ఫిరోజ్ ఘాండీ’ అనే
వ్యక్తిని ప్రేమించి, ఆయనను 1942లో వివాహమాడి, ‘రాజీవ్, సంజయ్’ అనే ఇద్దరు
కొడుకులను కన్నది. అయితే వారిద్దరి వివాహబంధం దృఢంగా సాగలేదు. (ఫిరోజ్ 1960లో
మరణించాడు.)
1959లోనే ఆమె కాంగ్రెస్ పార్టీకి
గౌరవాధ్యక్షురాలిగా నియమించబడింది. అదే సమయంలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా
కమ్యూనిస్టుల చేత ప్రజాస్వామిక పద్ధతిలో నడుస్తున్న కేరళ ప్రభుత్వాన్ని కూలదోసిన
‘ఖ్యాతిని’ మూటగట్టుకున్నది.
పిదప ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై, లాల్‌బహదూర్
శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా, ఆయన చనిపోయేవరకూ పనిచేసింది.
1966లో లాల్‌బహదూర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీలో
ప్రధాని పదవికి జరిగిన పోటీలో తనకంటె అనుభవజ్ఞుడైన మొరార్జీ దేశాయ్ పైనే గెలిచి
ప్రధానమంత్రి కాగలిగింది. తరువాత 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్
గెలవడంతో ఆమె ప్రధానిగా కొనసాగింది.
4వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు : 1967
మొత్తం స్థానాలు 523 | కాంగ్రెస్ 283 | స్వతంత్రులు 044 | జనసంఘ్ 035 | ఇతరులు 161 |
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు
గణనీయంగా తగ్గిపోయాయి. కొన్ని రాష్ట్రాలలో పార్టీ అధికారాన్ని కూడా కోల్పోయింది.
పైగా మూడింట రెండువంతుల సీట్ల ఆధిక్యత పోగొట్టుకున్న కారణంగా చట్టాలు చేయడానికి
ఇతర పార్టీలపైన ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది.
ఈ ఎన్నికల తరువాత ఇందిరాగాంధీ ఎన్నో ఒడిదుడుకులను
తట్టుకుంటూ నెమ్మదినెమ్మదిగా నిలదొక్కుకోసాగింది. (అప్పుడు నిజానికి ఆమెకు
ఎంతోకొంత అడ్డుతగిలినవాళ్ళు అదే పార్టీలోని నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి,
మొరార్జీ దేశాయ్, అతుల్య ఘోష్ వంటివారే.) ఒకవైపు ఈ చీలిక పెద్దదవుతుండగానే ఆమె
1969 జులైలో 14 ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ ఆర్డినెన్స్ అనే తన మొదటి బాణాన్ని
సంధించింది. అదే తరువాత బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970గా రూపొందింది.
అదే సంవత్సరంలో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు
జరిగాయి. ‘తన ప్రత్యర్ధులకు గుణపాఠం నేర్పడానికా’ అన్నట్లు, ఆమె ఆ పదవికి నీలం
సంజీవరెడ్డి పేరును ప్రతిపాదించినా, తరువాత తమ పార్టీ పార్లమెంటు, అసెంబ్లీ
సభ్యులకు మాత్రం వారివారి ‘అంతరాత్మ ప్రబోధానికి’ అనుగుణంగా ఓటు వేసుకోవచ్చు అనే
సూచన వదలడంతో – అంతకుముందే ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా
పోటీ చేసిన వి.వి గిరిని అదృష్టదేవత వరించింది. అధికారిక అభ్యర్ధి అయిన
సంజీవరెడ్డి ఓడిపోయాడు. దానితో అది అవతలి పక్షం కాంగ్రెసు నాయకులకు అశనిపాతమై,
అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాడు.
అయితే ఆ పార్టీలోని ఎంపీలతో పాటు ఎక్కువమంది
పార్టీ సభ్యులు సైతం ఇందిరనే సమర్ధించారు. ఆ మద్దతుతోనే ఆమె ‘కాంగ్రెస్ న్యూ’
(కొత్త కాంగ్రెస్) అనేదానిని స్థాపించి, అవతలి వర్గానికి ‘అభివృద్ధి నిరోధకులు’
అనే ముద్ర వేసి ‘తాను ఉదారంగా ప్రవేశపెట్టబోతున్న ఎన్నో పథకాలకు ఆ వర్గం అడ్డు
తగులుతోందని’ ప్రచారం చేయించసాగింది. అదే సమయంలో ఆమె ‘రాజభరణాల రద్దు’ (భారతదేశంలో
చేరిన సంస్థానాల అధీశులకు ఇస్తూ వచ్చిన భరణాల రద్దు – నిజానికి ఆ మొత్తం మన దేశ
బడ్జెట్‌తో పోలిస్తే పెద్దమొత్తం కానేకాదు) అనే మరొక జనాకర్షక విధానాన్ని తెరపైకి
తెచ్చింది. అయితే రాజ్యసభలో మూడింట రెండువంతుల ఆధిక్యం లేని కారణంగా దానిని
వాయిదావేయవలసి వచ్చింది.
1971లో ‘గరీబీ హటావో’ అనే సమ్మోహనాత్మక నినాదంతో
ఆవు-దూడ గుర్తుతో కాంగ్రెస్ (ఆర్) అనే పేరుతో ఇందిర ఎన్నికలను ఎదుర్కోగా, ఆమెకు
చాలామంచి ఆధిక్యం లభించడమే గాక, పాత కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది.
దాదాపు అదే సమయంలో కోర్టులు కూడా ‘ఆమె పార్టీయే నిజమైన కాంగ్రెస్’ అని
తీర్పునిచ్చాయి. ఆ ఎన్నికలలో వివిధ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి.
5వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు : 1971
మొత్తం స్థానాలు 518 | కాంగ్రెస్ 352 | సిపిఎం 025 | జనసంఘ్ 022 | ఇతరులు 119 |
ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కు తిరిగి సొంతంగానే
మూడింట రెండువంతుల సీట్ల ఆధిక్యత వచ్చిన కారణంగా ఆ పార్టీకి తన సొంత బలంతోనే
చట్టాలు చేసుకునే వెసులుబాటు మళ్ళీ కలిగింది.
ఆ సంవత్సరం చివరినాటికి పాకిస్తాన్ నుండి తూర్పు
పాకిస్తాన్ విడిపోతున్న సందర్భంగా భారత్ పాకిస్తాన్‌తో చేసిన యుద్ధంలో గెలుపొంది,
తూర్పు పాకిస్తాన్ బాంగ్లాదేశ్గా అవతరించడంతో ఇందిర కీర్తి పతాకస్థాయికి
చేరుకుంది.
అయితే 1973, 74 సంవత్సరాలలో చమురు ధరల విపరీతమైన
పెరుగుదల, కరవు, ద్రవ్యోల్బణం కారణంగా ఆమె కీర్తి మసకబారడం మొదలైంది. ఆమె
పరిపాలనకు వ్యతిరేకంగా బిహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలలో పెద్దఎత్తున ఆందోళనలు
మొదలయ్యాయి.
దానికి తోడు వ్యక్తిగతంగా ఆమె కీర్తికి భంగం
కలిగించే ఒక సంఘటన జరిగింది. 1971లో జరిగిన ఎన్నికల్లో రాయబరేలీ లోక్‌సభ స్థానం
నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కారణంగా ఆమె ఎన్నిక
చెల్లదని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 1975 జూన్ 12న తీర్పు ఇచ్చారు.
దానికి అనుగుణంగా తన పదవికి రాజీనామా చేయకుండా, (ఆంతరంగికుల ఒత్తిడికి లొంగడం
వల్లనో ఏమో) సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు,
నిజాయితీపరుడు అయిన జయప్రకాష్ నారాయణ్ ఆమె రాజీనామా చేయాలంటూ అప్పటికే ప్రజలచేత
మొదలుపెట్టించిన ‘శాసనోల్లంఘన కార్యక్రమం’ (Civil Disobedience)ఊపందుకుంటూ ఉండడంతో ఆమె 1975 జూన్ 25న ‘అంతర్గత అత్యయిక పరిస్థితి’ (Internal Emergency)ప్రకటించింది. దాని ఫలితంగా
ఎన్నో పౌరహక్కులు తొలగించబడ్డాయి. ఆరోజు భారత ప్రజాస్వామ్యంలో ‘కటిక చీకటి రోజు’గా
ఇప్పటికీ పరిగణించబడుతోంది. వెంటవెంటనే ప్రతిపక్షాలలోని ప్రముఖ నాయకులైన వాజ్‌పేయీ,
ఆఢ్వాణీ, మొరార్జీ దేశాయ్, మధు దండావతే వంటివారు అరెస్ట్ చేయబడ్డారు.
వార్తాపత్రికలు, ఇతర ప్రచారసాధనాలపైన ఎన్నో ఆంక్షలు విధించబడ్డాయి. అంతేగాక ఇందిర
ఆ గద్దెపై కొనసాగడానికి అనువైన రాజ్యాంగ సవరణలు కొన్ని చేయబడ్డాయి. (ఆరోజుల్లో
ఎందరో పెద్దలు అనుకుంటూండిన మాట – ‘అంతకుముందరి న్యాయమూర్తులను ప్రక్కన పెట్టి,
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా ఇందిర నియమించిన ‘ఎఎన్ రే’ ఆమెకు పూర్తిగా
అనుకూలుడు’ అని.) అనుకున్నట్లుగానే సర్వోన్నత న్యాయస్థానం ‘ఎన్నిక విషయమై ఆమె
నిర్దోషి’ అని తీర్పునిచ్చింది. దానితో ఆ అత్యయిక పరిస్థితిని కొనసాగిస్తూనే ఆమె
ప్రధానిగా పరిపాలించేందుకు దారి సులభమైపోయింది.
ఆ అత్యయిక పరిస్థితి
కాలంలో జరిగిన దురాగతాలు అన్నీయిన్నీ కావు. బలవంతపు కుటుంబ నియంత్రణ, నిజాయితీ గల
అధికారులను అవమానించడం, ప్రజలను భయభ్రాంతులను చేయడం వంటి దురాగతాలెన్నో ఆ
ఏడాదిన్నర కాలంలో జరిగాయి. వాటిలో ఎక్కువ దారుణాలు ఇందిర రెండవ కుమారుడు సంజయ్‌గాంధీ
ఆధ్వర్యంలోనే జరిగాయి.
ప్రతిపక్షాలన్నీ
అసంఘటితంగా ఉన్నాయనీ, ప్రజలు తన ‘క్రమశిక్షణాయుతమైన పరిపాలన’లో సంతుష్టులై
ఉన్నారనీ భ్రమపడిన ఇందిర 1977 జనవరిలో లోక్‌సభ ఎన్నికలను ప్రకటింపజేసింది. అలా
అకస్మాత్తుగా ఎన్నికలను ప్రకటించిననాటికి అన్ని పార్టీలకూ పోటీ చేయడానికీ, ప్రచారం
చేసుకోవడానికీ ఉండిన వ్యవధి 2 నెలలు మాత్రమే.
అయితే అనూహ్యమైన వేగంతో,
అతి తక్కువ వ్యవధిలో పాత కాంగ్రెస్ పార్టీ (మొరార్జీ దేశాయ్ మొదలగు వారి), రాజ్‌నారాయణ్,
జార్జి ఫెర్నాండెజ్‌ల నాయకత్వంలోని సోషలిస్ట్ పార్టీ, చరణ్‌సింగ్ ఆధ్వర్యంలోని
భారతీయ లోక్‌దళ్, వాజ్‌పేయీ, ఆఢ్వాణీల నేతృత్వంలోని భారతీయ జనసంఘ్, మరికొన్ని
చిన్నపార్టీలు కలసిపోయి ‘జనతా పార్టీ’ అనే కొత్త పార్టీ ఏర్పడింది. దానికితోడు,
ఎంతోకాలంగా ఇందిరమ్మకు బాసటగా ఉండిన జగ్జీవన్‌రామ్ కూడా ఆఖరి క్షణంలో ఆ జనతా
పార్టీలో చేరి, ఇందిరను నిర్ఘాంతపరిచాడు. అంతేగాక అనూహ్యంగా అప్పటి ఢిల్లీ ఇమామ్
కూడా ఆమె పార్టీని ఓడించమని బహిరంగంగా పిలుపునిచ్చాడు.
1977 ఎన్నికల ఫలితాలు
ఇందిరమ్మకు పిడుగుపాటుగా నిలిచాయి. తన పార్టీతో పాటు స్వయంగా తాను సైతం రాయబరేలీ
నియోజకవర్గం నుంచి అంతగా పేరు ప్రఖ్యాతులు లేని రాజ్‌నారాయణ్ చేతిలో ఓడిపోయింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఉత్తరభారతదేశమంతా ఆమెకు వ్యతిరేకంగా వోటు చేయగా, ‘ఎమర్జెన్సీ
క్రమశిక్షణ’ నచ్చిన దక్షిణాది రాష్ట్రాలన్నీ ఆమె పక్షాన నిలిచాయి. ఆ సమయంలో
కాంగ్రెస్ నుండి గెలిచి స్వల్పకాలం ఆమె పక్షాన నిలిచిన ఒకే ఒక నాయకుడు యశ్వంత్రావ్
బల్వంత్‌రావ్ చవాన్ (మహారాష్ట్ర) మాత్రమే.
6వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు : 1977
మొత్తం స్థానాలు 542 | జనతా పార్టీ 295 | కాంగ్రెస్ 154 | సిపిఎం 022 | అన్నాడిఎంకె 018 | ఇతరులు 053 |
ఈ ఎన్నికలలో జనతా పార్టీ గెలిచినా మూడింట
రెండువంతుల సీట్ల ఆధిక్యత లేని కారణంగా, చట్టాలు చేయడానికి ఆ పార్టీకి కొన్ని ఇతర పార్టీలపై ఆధారపడవలసిన
అవసరం కలిగింది.
*********************************************************
మొరార్జీ రణఛోడ్జీ
దేశాయ్ (29-02-1896 : 10-04-1995)
*********************************************************
1977నాటి జనతా ప్రభంజనం మొత్తం ఉత్తరభారతదేశాన్ని
ఊపివేసింది. అయితే అది వేర్వేరు దృక్పథాలు కలిగిన ఎన్నో పార్టీల సమాహారమే. ఆ
పార్టీల ఏకైక ధ్యేయం – ఏదోవిధంగా ఇందిరమ్మ దుష్పరిపాలనను అంతమొందించడమే. ముఖ్యంగా
అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజలపైన, ఆ పార్టీ నాయకులు చేసిన దురాగతాల కారణంగా.)
నిజానికి తమకు ఆధిక్యం వచ్చి గెలుస్తామని ఆ పార్టీల నాయకులు కూడా ఊహించి ఉండరేమో.
అప్పటికే ఎన్నోమార్లు ప్రధాని అయే అవకాశాలు
దగ్గరదాకా వచ్చి చెదరిపోయిన మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. ఆ
మంత్రివర్గంలో వాజ్‌పేయీ విదేశాంగమంత్రి, జగ్జీవన్‌రామ్ రక్షణ మంత్రి, చరణ్‌సింగ్
గృహమంత్రి, ఆఢ్వాణీ సమాచార ప్రసారణ మంత్రి, మధు దండావతే రైల్వే మంత్రి… తదితరులు
ఉండేవారు. మహారాష్ట్ర నుండి ఎన్నికైన వైబి చవాన్ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా
ఉన్నాడు.
నెహ్రూ మంత్రివర్గం వలెనే దేశాయ్
మంత్రివర్గంలోనివారు అందరూ సమర్ధులూ, అంకితభావంతో పనిచేసినవారూ. సుమారు రెండేళ్ళు సాగిన
తమ పాలనలో ఆ మంత్రివర్గం అంతకుముందు ఇందిరమ్మ కాలంలో జరిగిన దుష్కృత్యాలు
చాలావాటిని సరిదిద్దారు. వార్తాపత్రికలు, ఇతర మీడియాల పైన ఉన్న ఆంక్షలన్నింటినీ
తొలగించివేసారు కూడా. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టబడ్డాయి. 6వ పంచవర్ష
ప్రణాళిక మొదలైంది. బహుళజాతి సంస్థ అయిన కోకోకోలాను జార్జి ఫెర్నాండెజ్
నిషేధించాడు. స్వావలంబన దిశగా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించే ప్రయత్నాలు
మొదలయ్యాయి.
ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా, ఇందిరమ్మ కాంగ్రెస్
పార్టీలో ఒక విశేషం జరిగింది. ఆమె ఓడిన సుమారు ఏడాదిన్నర తర్వాత అప్పటి కర్ణాటక
ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ ‘ఇందిరకు రాజకీయ పునరావాసం కల్పించి తద్వారా తన
విధేయతను చాటుకోవడానికి’ 1978నవంబర్‌లో చిక్కమగళూరు పార్లమెంటు సభ్యుడితో రాజీనామా
చేయించి అక్కడ ఆమెతో పోటీ చేయించి ఆమెను పార్లమెంటుకు పంపాడు. (దానికి కృతజ్ఞతగా
ఆమె సంవత్సరం తిరక్కుండా అదే అర్స్‌ను గద్దెదింపించి గుండూరావును ముఖ్యమంత్రి
చేయడం విశేషం.) దాదాపు అదే సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి
ఇందిరను పార్టీ నుండి బహిష్కరించగా, ఆమె మరోసారి హస్తం ఎన్నికల గుర్తుగా ఇందిరా
కాంగ్రెస్ (Congress
I) అనే పార్టీని స్థాపించుకుంది. (ఆ సమయంలో లోక్‌సభలో
ప్రతిపక్ష నేతగా ఉన్న వైబి చవాన్, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌లో ఉండిపోయి,
కొన్నాళ్ళ తర్వాత చరణ్‌సింగ్ పార్టీ పంచన చేరాడు.)
1978లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల శాసనసభల
ఎన్నికలలో అనూహ్యంగా కాంగ్రెస్ (ఐ) విజయఢంకా మ్రోగించగా బ్రహ్మానందరెడ్డి
కాంగ్రెస్ మట్టికరిచింది. అది ఇందిరమ్మకు, ఆమె పార్టీకి మానసిక స్థైర్యాన్ని
కలిగించింది. మరికొన్నాళ్ళకు రెడ్డిగారు ‘తన పార్టీనుండి అమ్మగారి పార్టీకి వలసలు ఎక్కువైపోవడం’తో
తానే తన పార్టీ కార్యాలయానికి తాళాలు వేసేసి, బేషరతుగా ఇందిరమ్మ కాంగ్రెస్‌లో
చేరిపోయాడు. ఇందిర పార్టీ చివర ఉన్న ‘ఐ’ గుర్తు దాదాపు 1990ల వరకూ ఉండిపోయింది.
ఆ తరువాత అదే భారత జాతీయ కాంగ్రెస్‌గా
అవతారమెత్తడం, ప్రజలు కాలక్రమేణా ఆ వ్యవహారాన్నంతా మరచిపోవడం జరిగాయి.
అది అలా ఉండగా, 1978 డిసెంబర్ 19న పార్లమెంటు
జరుగుతూ ఉండగా, ‘పార్లమెంటు ధిక్కారం’ కారణంగా ఆ సమావేశాల చివరిరోజు వరకూ ఆమెను
సభనుంచి బహిష్కరించారు. స్వల్పకాలం ఆమె జైలుకు కూడా వెళ్ళాల్సి వచ్చింది.
అదే సమయంలో అప్పటి అధికార (జనతా) పార్టీలో వివిధ
పార్టీల నాయకుల మధ్య ‘తమతమ పార్టీల భావజాలాలలోని వైరుధ్యాల’ కారణంగా లుకలుకలు
మొదలయ్యాయి. దానితో స్వల్పవ్యవధిలోనే చరణ్ సింగ్, రాజ్‌నారాయణ్ వంటివారి మద్దతు
కూడగట్టుకుని అసమ్మతి స్వరం వినిపించడం మొదలుపెట్టాడు. కొద్దిరోజుల తర్వాత ఆయన
1978 జూన్‌లో తన మంత్రిపదవికి రాజీనామా చేసాడు. కానీ 1979 జనవరిలో ఉపప్రధాని,
ఆర్థిక మంత్రిగా తిరిగి మంత్రివర్గంలో చేరాడు. (అదే సమయంలో బ్రహ్మానందరెడ్డి
కాంగ్రెస్‌ను వదిలిపెట్టి వైబి చవాన్, చరణ్‌సింగ్‌తో చేతులు కలిపాడు. ఆ దౌర్భాగ్య
రాజకీయం అలాగే కొనసాగుతూ ఉండగా మొరార్జీ దేశాయ్ పరిస్థితి తన అదుపులో లేదని
గ్రహించి, తన ప్రధానమంత్రి పదవికి 1979 జులైలో రాజీనామా చేసాడు.
ఆసక్తికరంగా, అప్పుడు ‘శ్రీమతి గాంధీ తనకు మద్దతు
ఇస్తానని మాట ఇచ్చిన కారణంగా’ ‘తానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను’ అంటూ ముందుకు
వచ్చాడు చరణ్‌సింగ్. అయితే పార్లమెంటులో బలపరీక్షకు ఇంక రెండుమూడు రోజుల వ్యవధి
ఉండగా అకస్మాత్తుగా ఇందిరమ్మ తాను మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో
చరణ్ సింగ్ ఆట కట్టింది. అయితే రాష్ట్రపతి సంజీవరెడ్డి చరణ్సింగ్నే ఆపద్ధర్మ
ప్రధానిగా ఉండమని చెప్పడంతో దగ్గరలో ఉన్న ఉపయెన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆయనే
పదవిలో కొనసాగగలిగాడు. (అలా 1979 ఆగస్టు 20 నుండి ఇందిరమ్మ 1980 జనవరి 14న
ప్రమాణస్వీకారం చేసేవరకూ, పార్లమెంటులో బలపరీక్షకు నిలువలేకపోయినా చెప్పుకోదగ్గ
కాలం ఆపద్ధర్మ ప్రధానిగా ఉండదగిన భాగ్యం, ఖ్యాతి చరణ్‌సింగ్‌కు దక్కాయి.
*************************************************
చౌధురీ చరణ్‌సింగ్ (23-12-1902
: 29-05-1987)
*************************************************
చరణ్‌సింగ్ కాంగ్రెస్
పార్టీ మద్దతుతో సుమారు 20 రోజులు, ఆ తర్వాత కొన్నాళ్ళు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా
ఉన్నారు. ఆ సమయంలో వైబి చవాన్ ఆయనకు ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆపద్ధర్మ ప్రధానిగా
ఉన్నందున చరణ్‌సింగ్‌కు ఏ కీలకమైన నిర్ణయమూ తీసుకునే అవకాశమే లేకపోయింది. ‘రైతు
బాంధవుడి’గా ఆయనకు మంచిపేరు ఉండేది.
7వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు : 1980
మొత్తం స్థానాలు 529 | కాంగ్రెస్ 353 | జనతాపార్టీ (ఎస్)(చరణ్‌సింగ్) 041 | సిపిఐ(ఎం) 037 | ఇతరులు 098 |
ఈ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సొంతంగానే మూడింట
రెండువంతుల సీట్ల ఆధిక్యత వచ్చిన కారణంగా, ఆ పార్టీకి తన స్వంత బలంతోనే చట్టాలు చేసుకోగలిగే
వెసులుబాటు మళ్ళీ కలిగింది.
(మరోసారి ప్రధాని అయిన ఇందిరా
గాంధీ పరిపాలనా కాలాన్ని తరువాయి భాగంలో విశ్లేషించుకుందాం)