Vijayawada
Parliamentary Constituency Profile
తెలుగువారి సాంస్కృతిక
రాజధానిగా విజయవాడకు మంచిపేరుంది. అన్నిరంగాలలోనూ ఆరితేరిన ఉద్దండులకు ఆలవాలం విజయవాడ
మహానగరం.
విజయవాడ లోక్‌సభా నియోజకవర్గం
ప్రస్తుతం ఎన్‌టిఆర్ జిల్లాలో ఉంది. ఆ పార్లమెంటరీ స్థానం 1952లో ఏర్పాటయింది. ఆ
ఎంపీ సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి తిరువూరు (ఎస్సీ),
విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ (ఎస్సీ),
జగ్గయ్యపేట.
విజయవాడ లోక్‌సభా
స్థానానికి 1952లో మొట్టమొదట జరిగిన ఎన్నికలో బెంగాల్‌కు చెందిన కళాకారుడు
హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి కమ్యూనిస్టుల సహకారంతో
విజయం సాధించారు. ఆ తర్వాత విజయవాడ ఎంపీ సీటు చాలాకాలం కాంగ్రెస్ చేతిలో ఉంది.
1957, 1962, 1967, 1971, 1977, 1980, 1989లో కాంగ్రెస్ అభ్యర్ధులు విజయాలు
సాధించారు. 1984, 1991 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం తరఫున వడ్డే శోభనాద్రీశ్వరరావు
గెలిచారు. 1996, 1998లో కాంగ్రెస్ నుంచి పర్వతనేని ఉపేంద్ర అధికారం
దక్కించుకున్నారు. 1999లో తెలుగుదేశం ఉనికి చాటుకోగా, 2004, 2009లో మళ్ళీ
కాంగ్రెస్ నుంచి లగడపాటి రాజగోపాల్ గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం
తరఫున కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని గెలుపొందారు. అయితే 2024 జనవరిలో ఆయన
టిడిపికి రాజీనామా చేసి వైఎస్ఆర్‌సిపిలో చేరారు.
2024 ఎన్నికల్లో అధికార
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా కేశినేని శ్రీనివాస్ (నాని) పోటీ చేసారు. ఎన్‌డిఎ కూటమి
తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా కేశినేని శివనాథ్ (చిన్ని) తన అన్నకు ప్రత్యర్ధిగా
నిలిచారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా వల్లూరు భార్గవ్ బరిలో ఉన్నారు.