Vijayawada
East Assembly Constituency Profile
ఎన్టిఆర్ జిల్లాలోని విజయవాడ
తూర్పు నియోజకవర్గం 1967లో ఏర్పడింది. అంతకుముందు విజయవాడ దక్షిణ నియోజకవర్గంగా
ఉండేది. ప్రస్తుత శాసనసభా స్థానం పరిధిలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని
40 వార్డులు ఉన్నాయి.
విజయవాడ దక్షిణ
నియోజకవర్గంగా ఉండేటప్పుడు 1955, 1962లో జరిగిన ఎన్నికల్లో సుప్రసిద్ధ స్వాతంత్ర్య
సమరయోధులు అయ్యదేవర కాళేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. 1962లో
ఆయన తదనంతరం జరిగిన ఉపయెన్నికలోనూ కాంగ్రెసే గెలిచింది.
1967లో విజయవాడ తూర్పు
నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ఆధిక్యమే కొనసాగింది. 1967, 1972, 1978
ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు
ఆ పార్టీ ఒకసారి గెలిచింది. 1985లో వంగవీటి మోహనరంగా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు.
1988లో ఆయన హత్య అనంతరం 1989, 1994 ఎన్నికల్లో రంగా భార్య వంగవీటి రత్నకుమారి
కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 1999లో బిజెపి అభ్యర్ధిగా ప్రముఖ సినీనటుడు కోట
శ్రీనివాసరావు గెలుపు దక్కించుకున్నారు. మళ్ళీ 2004లో కాంగ్రెస్ నుంచి వంగవీటి
రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ
నుంచి యలమంచిలి రవి గెలుపొందారు.
1983లో ఒకసారి గెలిచిన
తెలుగుదేశానికి మళ్ళీ రాష్ట్ర విభజన జరిగేంతవరకూ విజయవాడ తూర్పు నియోజకవర్గం అందని
ద్రాక్షగానే ఉండిపోయింది. ఎట్టకేలకు 2014లో టిడిపి అభ్యర్ధి గద్దె రామ్మోహన్
వైసీపీ అభ్యర్ధి వంగవీటి రాధాకృష్ణను ఓడించారు. 2019లో కూడా గద్దె రామ్మోహన్
వైసీపీ ప్రత్యర్ధి బొప్పన భవకుమార్ మీద గెలుపొందారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్సిపి
దేవినేని అవినాష్‌ను నిలబెట్టింది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం
అభ్యర్ధిగా గద్దె రామ్మోహన్ మూడోసారి
గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా
పొనుగుపాటి నాంచారయ్య రంగంలో ఉన్నారు.