Vijayawada
Central Assembly Constituency Profile
ఎన్టిఆర్ జిల్లాలో
విజయవాడ నగరం పరిధిలోని సెంట్రల్ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. అంతకుముందు
కంకిపాడు నియోజకవర్గం ఉండేది. సెంట్రల్ స్థానం పరిధిలో విజయవాడ అర్బన్ మండలంలోని
కొన్ని భాగాలు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 21 వార్డులూ ఉన్నాయి.
కంకిపాడులో 1952లో సిపిఐ
గెలిచింది. 1955లో కృషికార్ లోక్‌పార్టీ నుంచి, 1962లో కాంగ్రెస్ పార్టీ నుంచి సి రామకోటయ్య
గెలిచారు. 1964 ఉపయెన్నికలో సిపిఐ గెలిచింది. 1967, 1972, 1978లో కాంగ్రెస్
గెలుపొందింది. 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు తెలుగుదేశం
నుంచి దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ గెలిచారు. 1999 ఎన్నికల్లో నెహ్రూ కాంగ్రెస్
తరఫున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధి వై నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. అదే నెహ్రూ
2004లో కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు.
2008లో విజయవాడ సెంట్రల్
నియోజకవర్గం ఏర్పాటైంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి మల్లాది విష్ణు,
ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణను ఓడించారు. రాష్ట్ర విభజన తర్వాత
జరిగిన 2014 ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి
పూనూరి గౌతంరెడ్డిపై గెలిచారు. 2019లో వైఎస్ఆర్సిపి నుంచి మల్లాది విష్ణు టిడిపి
అభ్యర్ధి బోండా ఉమాను ఓడించారు.
2024 ఎన్నికల కోసం అధికార
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గంలో తమ అభ్యర్ధిని మార్చింది. విజయవాడ పశ్చిమం నుంచి
వెలంపల్లి శ్రీనివాసరావును తీసుకొచ్చి సెంట్రల్ బరిలో దింపింది. ఆయనకు
ప్రత్యర్ధిగా ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి బోండా ఉమా పోటీ
చేస్తున్నారు. ఇక ఇండీ కూటమి తరఫున సిపిఐ(ఎం) అభ్యర్ధిగా చిగురుపాటి బాబూరావు
నిలబడ్డారు.