Vijayawada
West Assembly Constituency Profile
విజయవాడ పశ్చిమ
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేవలం ఒకేఒక్కసారి గెలిచింది. బహుశా అందుకేనేమో,
ఆ స్థానాన్ని ఎన్నికల పొత్తు పేరిట బిజెపికి కేటాయించింది. మరి అక్కడ బిజెపి
గెలుపు సాధ్యమేనా?
ఎన్‌టిఆర్ జిల్లాలోని
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఆ అసెంబ్లీ సీటులో విజయవాడ అర్బన్
మండలం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 20 వార్డులూ ఉన్నాయి.
విజయవాడ పశ్చిమ
నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్ళలో కాంగ్రెస్ ఆధిక్యమే ఉండేది. 1967, 1972, 1978
ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధులే గెలిచారు. 1983లో కొత్తగా పెట్టిన తెలుగుదేశం
పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు. తర్వాత నుంచీ సిపిఐ,
కాంగ్రెస్ మధ్యే ఈ సీటు దోబూచులాడుతూ వచ్చింది. 1985, 1994, 2004 ఎన్నికల్లో సిపిఐ
గెలిచింది. 1989, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో చిరంజీవి పార్టీ
ప్రజారాజ్యం తరఫున వెలంపల్లి శ్రీనివాసరావు విజయం సాధించారు.
రాష్ట్ర విభజన తర్వాత
జరిగిన రెండు ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సిపియే గెలిచింది. 2014లో జలీల్‌ఖాన్, అప్పుడు
బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన వెలంపల్లి శ్రీనివాసరావు మీద గెలిచారు. 2019లో అదే
వెలంపల్లి వైఎస్ఆర్‌సిపిలో చేరి ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేసారు. టిడిపి అభ్యర్ధి
షబానా ఖాతూన్ మీద గెలిచారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్‌సిపి
ఈ స్థానంలో షేక్ ఆసిఫ్‌ని మోహరించింది. వెలంపల్లిని విజయవాడ సెంట్రల్‌కు
మార్చింది. ఇక ఎన్‌డిఎ కూటమి తరఫున బిజెపి అభ్యర్ధిగా యలమంచిలి సత్యనారాయణ చౌదరి
అలియాస్ సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి సిపిఐ అభ్యర్ధి జి
కోటేశ్వరరావు బరిలో ఉన్నారు.