Tiruvuru
Assembly Constituency Profile
కృష్ణా జిల్లా నుంచి కొత్తగా ఎన్టిఆర్ జిల్లా
ఏర్పాటయింది. ఆ జిల్లాలో ఏడు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఎస్సీలకు
రిజర్వ్ అయిన రెండు స్థానాల్లో తిరువూరు ఒకటి.
తిరువూరు శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పడింది.
ఆ అసెంబ్లీ సీటు పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి ఎ కొండూరు, గంపలగూడెం,
తిరువూరు, విస్సన్నపేట.
తిరువూరులో మొదటినుంచీ కాంగ్రెస్కు బలం ఎక్కువే.
అది వైఎస్ఆర్సిపి వైపు మళ్ళింది. అలా అని తెలుగుదేశం పనితీరు పూర్తిగా
తీసికట్టుగా ఉందని చెప్పలేం. ఆ పార్టీ కూడా నాలుగు సార్లు గెలిచింది.
తిరువూరు నియోజకవర్గంలో 1951 ఎన్నికల్లో సిపిఐ గెలిచింది.
ఆ తర్వాత సుదీర్ఘకాలం అంటే 1955, 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ విజయకేతనం ఎగురవేసింది. 1983, 1985 ఎన్నికల్లో కొత్తపార్టీ తెలుగుదేశం గెలిచింది.
1989లో కాంగ్రెస్ మళ్ళీ ఉనికి చాటుకుంది. 1994, 1999లో టిడిపి జోరందుకుంది. ఇక
2004, 2009 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నాయకులు దాదాపు
అందరూ వైఎస్ఆర్సిపిలోకి మళ్ళిపోయారు. అలాగే కాంగ్రెస్ ఓటుబ్యాంకు కూడా వైసిపికి
తరలిపోయింది. ఆ తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గ ఓటర్లు వైఎస్ఆర్సిపినే
ఎంచుకున్నారు. ఆ పార్టీ అభ్యర్ధి కొక్కిలిగడ్డ రక్షణనిధినే రెండుసార్లూ
గెలిపించారు.
ఇప్పుడు 2024 ఎన్నికల్లో
అధికార వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్
బరిలోకి దిగుతున్నారు. అమరావతి ఉద్యమంతో పేరు తెచ్చుకున్న కొలికపూడి
శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఇక్కడ రంగప్రవేశం చేయిస్తోంది. ఇక
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా లాం తాంతియాకుమారి పోటీ చేస్తున్నారు.