Our Prime Ministers, Their Leadership and Administration Skills Special Series – Part 3
Pandit Jawaharlal Nehru – 2
******************************************************************
సత్యరామప్రసాద్ కల్లూరి రచన : మన
ప్రధానమంత్రులు
******************************************************************
పండిత జవహర్లాల్
నెహ్రూ (14-11-1889 : 27-05-1964) : 2
******************************************************************
నెహ్రూ పాలనలోని సుగుణాల గురించి గత
భాగంలో చూసాం. ఆయన పాలనా విధానాల వల్ల దేశం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. అవేమిటో చూద్దాం.
(ఈ) అల్పసంఖ్యాకులపై వల్లమాలిన ‘అధిక
ప్రేమ’:
(1) రాజ్యాంగంలో హిందువులకు మొత్తం వ్యతిరేకంగానే ఉన్న 30వ అధికరణం,
(2) ‘ఉమ్మడి పౌర స్మృతి’ ప్రాధాన్యాన్ని పక్కన పెట్టి ‘హిందూ కోడ్
బిల్’ను మాత్రమే చేపట్టడం
(3) 1954లో వక్ఫ్ బోర్డ్‌ను ప్రారంభించడం.
… ఇవన్నీ నెహ్రూకు అల్పసంఖ్యాకుల మీద
ఉన్న ప్రత్యేకమైన అవ్యాజ అనురాగానికి తార్కాణాలు.
ఎంత చెడ్డా గాంధీగారి
ప్రియశిష్యుడైనందుకు ఆయనకు ఉన్న ‘‘మతపరమైన అల్పసంఖ్యాకుల పట్ల ఉదారతను చూపిస్తే వాళ్ళు ఏదో ఒక రోజున
కచ్చితంగా భారతీయ జనజీవన స్రవంతిలో భాగమైపోతారు’’ అనే అపోహే నెహ్రూకు కూడా ఉండి
ఉండాలి.
మన రాజ్యాంగంలోని ‘వివాదాస్పదమైన 30వ
అధికరణం’ మతపరమైన అల్పసంఖ్యాకులకు తమ విద్యాసంస్థలలో తమ మతాలకు సంబంధించిన అంశాలను
చొప్పించుకునే అవకాశం కల్పించింది. (అన్నట్లు ‘భారత రాజ్యాంగపు ముసాయిదా ప్రతి
రూపకల్పన’లో నెహ్రూ కూడా పాల్గొన్నాడు)
ఇక హిందూ కోడ్ బిల్ విషయానికి వస్తే తన
1952 ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించి దానికి అనుకూలంగా ప్రచారం చేసాడు
కూడా. ‘‘మన రాజ్యాంగపు ఆదేశసూత్రాలలో 44వ అధికరణంలో నిర్దేశించబడి ఉన్న, ఆనాటికే ఎంతో
ఆవశ్యకమైన ‘ఉమ్మడి పౌరస్మృతి’ని గురించి ఆయన గట్టిగా ఆలోచించిన దాఖలాలేమీ లేవు.
దానికి అనుగుణంగానే ఆయన కేవలం హిందూ పౌరస్మృతిని మాత్రమే స్పృశించి ‘హిందూ
వివాహాలు, హిందూ వారసత్వాలు, హిందూ మైనారిటీ & గార్డియన్షిప్, హిందూ పెంపకాలు’ మొదలైన
అంశాలకు మాత్రమే విజయవంతంగా చట్టాల రూపం కల్పించాడు. తక్కిన ఏ మతానికి సంబంధించిన
వ్యవహారాలలోనూ వేలు పెట్టలేదు. అలా చేయడాన్ని ‘హిందూ కోడ్ బిల్లు హిందువులలో
అసమానతలను తొలగించడానికీ, సాంఘిక ఐక్యతను నెలకొల్పడానికీ దోహదం చేస్తుంది’ అంటూ
గట్టిగా సమర్ధించుకున్నాడు. దానిని శ్యామాప్రసాద్ ముఖర్జీ, ఆచార్య కృపలానీ వంటి
ప్రముఖులు తీవ్రంగా గర్హించారు. పటేల్ కూడా తాను బ్రతికి ఉన్నంత కాలం దానిని
అడ్డుకున్నాడు. అయితే తనకు రెండు చట్టసభలలోనూ ఆధిక్యం ఉండడంతో నెహ్రూ తన పంతం
నెగ్గించుకున్నాడు.
మోదీ పాలనలో
ఇప్పటి పరిస్థితి:
ఎన్నో అవరోధాల
మధ్య ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టడానికి ముమ్మరంగా ప్రయత్నాలు ప్రస్తుతం
జరుగుతున్నాయి. ఇది గనుక ఫలిస్తే ఏ మతానికి చెందిన మనోభావాలూ దెబ్బతినడానికి
ఆస్కారం ఉండదు.
ఇది మాత్రమే
గాక, వక్ఫ్ బోర్డు అధికారాలపైన, పరిమితుల పైన నిశితమైన అధ్యయనం జరుగుతోంది. ఇది
ఇలా ఉండగా, ఈ బోర్డు ‘తనదిగా పేర్కొంటూ కలిపివేసుకోవాలని ప్రయత్నిస్తున్న’ ఎన్నో
స్థలాలు చేజారనీయకుండా సంబంధిత కోర్టులు అడ్డుకుంటున్నాయి కూడా.
(ఉ) నేపాల్,
బెలూచిస్తాన్‌లను భారతదేశంలో కలుపుకునే అవకాశాన్ని వదులుకోవడం:
మరో విషయం –
నేపాల్ దేశం తనంతట తానుగా మనదేశంలో అంతర్భాగంగా ఉండడానికి సిద్ధపడినా, దానికి
నెహ్రూ అంగీకరించలేదు. అదేవిధంగా మనతో కలవడానికి ఇష్టపడిన బెలూచిస్తాన్ విషయమై
కూడా, ఎంతో ప్రాముఖ్యం కలిగిన దాని భౌగోళిక స్థానాన్ని ఉపేక్షించి, ఆయన ఆ
ప్రతిపాదనను తిరస్కరించాడు. ఈనాడు ఆ రెండింటి పరిస్థితి దయనీయంగా ఉందన్న విషయం
అందరికీ తెలిసిందే.
(ఊ) విమాన సంస్థల జాతీయీకరణ:
నెహ్రూ ప్రభుత్వపు మరొక తొందరపాటుతో
కూడిన తీవ్రమైన చర్య – ‘జెఆర్‌డి టాటా కంపెనీ సమర్ధంగా నడుపుతూ వచ్చిన
విమానసంస్థను 1953లో జాతీయీకరణం చేయడం’. టాటాయే గాక పలువురు శ్రేయోభిలాషులు అది
ప్రయోజనకరం కాబోదనీ, ‘ఉద్యోగుల కోసం, ఉద్యోగుల చేత, ఉద్యోగుల యొక్క’ సంస్థగా
మాత్రమే మిగిలి, పన్నులు కట్టేవాళ్ళకు పెనుభూతం కాగలదనీ హెచ్చరించినా ఆయన వినలేదు.
దానితో అది అచిరకాలంలో ఒక ‘జాతీయ సంస్థ’ అయిపోయింది. కొద్ది వ్యవధి కూడా కాకుండానే
దానిని ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌గా విడగొట్టారు. రెండు సంస్థలూ భారీ
నష్టాలతో నడుస్తూ ఉండడంతో 2007లో ఆ రెండింటినీ కలిపివేసారు.
మోదీ పాలనలో ఇప్పటి పరిస్థితి:
తన బద్ధకానికీ, ప్రభుత్వ సంస్థలలో
కానవచ్చే తాత్సారానికీ పెట్టినది పేరుగా నడుస్తూ, భరించలేని ఐరావతం వలె తయారై,
ఎన్నిసార్లు లేవనెత్తబోయినా లేవలేకపోయిన ఆ సంస్థను ప్రైవేటుపరం చేయాలనే
నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం 2021లో తీసుకుంది. అప్పటివరకూ సుమారు 80వేల కోట్ల
రూపాయల నష్టాన్ని చవిచూసిన ఆ సంస్థ 70 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు యథాస్థానానికే
(టాటావారి అజమాయిషీలోకే) చేరుకుంది.
‘వ్యాపారం చేయడం మా ప్రభుత్వ విధానం
కాదు’ అనేది మోదీ ప్రభుత్వ విధానాలలో ఒకటి కనుక, అది ఇలాంటి తెలివితక్కువ విధానాలు
ఒక్కొక్కదాన్నీ తగిన రీతిలో పరిష్కరిస్తూ వస్తోంది.
(ఋ) ఇంపీరియల్ బ్యాంక్ జాతీయీకరణ:
నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న మరొక నిర్ణయం
– బ్రిటిష్ కాలం నాటి ఇంపీరియల్ బ్యాంక్ జాతీయీకరణ. దానికే 1955లో దాని అనుబంధ
సంస్థలతో కలిపి ‘స్టేట్ బ్యాంక్’ అనే పేరు పెట్టారు.
మోదీ పాలనలో ఇప్పటి పరిస్థితి:
మోదీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ యొక్క
అనుబంధ బ్యాంకులన్నింటినీ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో విలీనం చేసింది. దానితో
ఈ బ్యాంక్ ఒక దిగ్గజ బ్యాంక్‌గా రూపొందింది.
(ౠ) జీవితబీమా కంపెనీల జాతీయీకరణ:
నెహ్రూ ప్రభుత్వపు ‘జాతీయీకరణ వెల్లువ’లో
ఏర్పడిన మరొక మార్పు – 150 ప్రైవేటు జీవిత బీమా కంపెనీలను కలిపివేసి జాతీయం చేసి,
1956లో ‘భారతీయ జీవితబీమా సంస్థ’ను (LIC) ఏర్పాటు చేయడం. ఆ సంస్థ మొదటినుండీ లాభాలలో నడుస్తున్నా ‘దాని ప్రయోజనాలు ఎక్కువగా
అందినది మాత్రం దాని వాటాదారుల కంటె దాని ఉద్యోగులకే’ అనేది ఎంతోమంది అభిప్రాయం.
(ఎ) లైసెన్సులు, పర్మిట్ల రాజ్యం:
నెహ్రూ కాలం నుండి దాదాపు 1990 వరకూ
కాంగ్రెస్ ప్రభుత్వం ‘లైసెన్సులు, పర్మిట్లకు లోబడిన ప్రభుత్వంగా చెడ్డపేరు
తెచ్చుకుంది. (దానికి లైసెన్సులు, పర్మిట్ల రాజ్యం అనే పేరు పెట్టినవాడు కీ.శే. చక్రవర్తుల రాజగోపాలాచారి)
నెహ్రూ ప్రభుత్వం ఈ ఆంక్షను ‘ప్రైవేటు
సంస్థల విపరీతమైన లాభాలను అదుపులో ఉంచడానికి, తద్వారా సమాజంలోని అంతరాలను బాగా
తగ్గించడానికి ఉపయోగించే సాధనం’గా సమర్ధించుకుంటూ వచ్చింది. ఆ విధానం కారణంగానే Industries
(Development Regulation) Act 1951 – IDRA (పరిశ్రమల పెంపుదలపై అదుపు చట్టం) చేయబడింది.
సామ్యవాదపు ‘ఆకర్షణీయ లక్ష్యాలకు’ అనుగుణంగానే – అంటే ‘సమాజంలోని ఆర్థిక అసమానతలను
తొలగించడానికి’ ఆ చట్టం రూపొందించబడినదని ఆ
ప్రభుత్వాలు వక్కాణిస్తూ వచ్చినా, నిజానికి పారిశ్రామిక సంస్థలు పాటించవలసిన
నియమాలు భయంకరంగా ఉండేవనీ, ఒక్కొక్కసారి 80 వేర్వేరు ప్రభుత్వ విభాగాల వద్దకు
వెళ్ళి ప్రతీ విభాగాన్నీ సంతృప్తిపరచవలసివచ్చేదనీ ఆ రోజుల్లో అనుకునేవారు.
అంతేగాక, ఉత్పత్తి చేయవలసిన పరిమాణాలపైన, ప్రతీ సంవత్సరం పెట్టవలసిన పెట్టుబడుల
పైన కూడా ఆంక్షలు ఉండేవట.
మొత్తం మీద ఆ చట్టం కారణంగా ప్రయోజనాల
కంటె నష్టాలే కలిగాయన్నది నిర్వివాదాంశం. 1991లో పీవీ నరసింహారావు దాన్ని రద్దు
చేసేవరకూ దాని దుష్ఫలితాలు కొనసాగాయి.
(ఏ) భారతదేశపు చరిత్రను ‘ఇస్లామీకరణ’
చేయడం:
తెలిసో, తెలియకో నెహ్రూ ‘భారతదేశ
చరిత్రను ప్రజలకు నేర్పించడం’ విషయంలో కూడా పెద్ద దెబ్బ కొట్టాడు. కనీసం సాధారణ
బడులలో కూడా ఎన్నడూ చదివి ఉండని ‘మౌలానా అబుల్ కలామ్ ఆజాద్’ను మొట్టమొదటి
విద్యామంత్రిగా నియమించడం వల్ల అది సాధ్యపడింది. ఆజాద్, అతని సహచరులైన సిబ్బంది
పుణ్యమా అని ముసల్మానుల పరిపాలనా కాలమైన సా.శ. 1192 నుండి 1707 (సుమారు 500 ఏళ్ళ)
కాలానికి పాఠశాలల సిలబస్‌లలో 80శాతం చోటు లభించగా, మిగిలిన సుమారు 5,000 సంవత్సరాల
కాలవ్యవధికి లభించినది కేవలం 20శాతం స్థలమే.
అలా చేయడంలో దక్కవలసిన కీర్తి కేవలం
ఆజాద్ గారికే కాదు, అవే ఆదర్శాలతో ఆయన తర్వాత నియమితులైన ఇతర మంత్రులకూ, వారి
పరివారానికి కూడా చెందుతుంది. 1967-72 మధ్య తప్పించి సుమారు 20 సంవత్సరాల కాలం పాటు ఆజాద్
మతావలంబులే విద్యామంత్రులుగా నియమించబడడం కేవలం కాకతాళీయం అనుకోగలమా?
మోదీ పాలనలో ఇప్పటి పరిస్థితి:
పాత విద్యావిధానాన్ని కూలంకషంగా
పరిశీలించి, క్రమక్రమంగా దానిలోని లోటుపాట్లను సరిదిద్దే ప్రక్రియ 2014 నుండే
మొదలైంది. ‘ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టబడిన’ వీరుల, స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను,
జీవిత చరిత్రలను, ఉపేక్షించబడిన సంఘటనలను చేర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు
కూడా.
(ఐ) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పైన
‘అయిష్టత’:
ఆర్ఎస్ఎస్ పేరెత్తితేనే నెహ్రూ చాలా అసహనాన్ని
చూపేవాడట. నిజానికి అది ఒక స్వచ్ఛంద సేవకుల సంస్థ. వరదలు, రైలుప్రమాదాలు వంటి ఏ
జాతీయ విపత్తు కలిగినా దాని సభ్యులు అక్కడకు చేరి, తమవంతు పని చేసి, నిశ్శబ్దంగా
తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు నేటికీ. ఆ సంస్థ పైన నిప్పులు చెరగడానికి ఏ చిన్న అవకాశం
వచ్చినా ఆయన దానిని వదులుకునేవాడు కాదు. ఆయన
ఆర్ఎస్ఎస్ను హిట్లర్ నాజీ దళం వంటి ప్రైవేటు సైన్యాలతో పోలుస్తూ ఉండేవాడు. (బహుశః
ఈ దేశానికి సేవ చేయడానికి ‘మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన’ కాంగ్రెసు పార్టీకే ఆ
అర్హత ఉందనీ, ఆ పార్టీ కనుసన్నలలోనే ఏ సేవాకార్యమైనా జరగాలనీ ఆయన అభిమతమై ఉండాలి.)
గాంధీ మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్
గాడ్సే అంతకుముందు కొంతకాలం ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా ఉండడంతో ఆ సంస్థను ఒక సంవత్సరం
పాటు నెహ్రూ, అప్పటి హోంమంత్రి పటేల్ నిషేధించారు. అయితే ఆర్ఎస్ఎస్కు ఆ సంఘటనతో
ప్రమేయం ఉన్నట్లు ఆధారాలేమీ దొరకలేదు, ఆ అభియోగం ఋజువు కాలేదు.
(అయినా సరే, నాటినుండి నేటివరకూ
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ‘మహాత్ముడిని చంపించింది ఆర్ఎస్ఎస్సే’ అంటూ ఆడిపోసుకోవడం
పరిపాటి అయిపోయింది. ఆ కారణంగా ఎందరి మనస్సులలోనో ఆర్ఎస్ఎస్ పట్ల ఒక దురభిప్రాయం
ఏర్పడి, అదే తరతరాలకూ విస్తరించింది. మనమధ్య ఉండే ‘సగంసగం చదువుల నాగరికులు’ అదే
అపవాదును సమర్ధంగా కొనసాగిస్తూ ప్రచారం చేస్తున్నారు కూడా. 2016లో అదే అభియోగాన్ని
రాహుల్ గాంధీ ఒక సభలో చేయగా ఆ సంస్థ తరఫున ఒకరు పరువునష్టం దావా వేసి అతడిని
కోర్టుకు ఈడ్వడంతో అతగాడు వెనక్కు తగ్గవలసి వచ్చింది.)
(ఇదీ… మొదటి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ పరిపాలనలో భారతదేశపు ప్రజాస్వామ్యం కొనసాగిన తీరు. తదుపరి భాగంలో తరువాతి ప్రధానమంత్రుల పాలనా విధానాలను తెలుసుకుందాం.)