Pedana
Assembly Constituency Profile
కృష్ణాజిల్లాలోని పెడన అసెంబ్లీ
స్థానం 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. అంతకు ముందు మల్లేశ్వరం
నియోజకవర్గం ఉండేది. పెడన అసెంబ్లీ పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి గూడూరు,
పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను.
తొలుత మల్లేశ్వరం
నియోజకవర్గంలో 1955, 1962, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పి పమిడేశ్వరరావు
విజయం సాధించారు. బి నిరంజనరావు 1967లో స్వతంత్ర అభ్యర్ధిగానూ, 1978లో జనతా పార్టీ
టికెట్ మీదా గెలుపు దక్కించుకున్నారు. 1983, 1985ల్లో కొత్తపార్టీ తెలుగుదేశం
గెలిచింది. 1989లోనూ, 2004లోనూ కాంగ్రెస్ నుంచి బూరగడ్డ వేదవ్యాస్ విజయం
సాధించారు. 1994, 1999 ఎన్నికల్లో కాగిత వెంకట్రావు తెలుగుదేశం జెండాను
రెపరెపలాడించారు.
2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో
మల్లేశ్వరం నియోజకవర్గాన్ని రద్దు చేసి పెడన నియోజకవర్గం ఏర్పాటు చేసారు. పెడన
శాసనసభా నియోజకవర్గం కొత్తగా ఏర్పడ్డాక మొదటిసారి అంటే 2009లో జరిగిన ఎన్నికల్లో
కాంగ్రెస్ అభ్యర్ధి జోగి రమేష్ టిడిపి అభ్యర్ధి కాగిత వెంకట్రావును ఓడించారు.
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక 2014లో టిడిపి అభ్యర్ధి కాగిత
వెంకట్రావు వైఎస్ఆర్సిపి అభ్యర్ధి బూరగడ్డ వేదవ్యాస్ మీద గెలిచారు. మరోవైపు
జోగిరమేష్ 2013లో వైసీపీలో చేరారు. 2014లో ఆయన మైలవరం అసెంబ్లీ స్థానానికి పోటీ
చేసి ఓడిపోయారు. 2019లో పెడన నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జోగి రమేష్‌ను ఈసారి
పెడన అసెంబ్లీ సీటు బరిలోకి దింపింది. ఆయన తెలుగుదేశానికి చెందిన కాగిత
వెంకట్రావును ఓడించారు.
2024లో అధికార వైఎస్ఆర్సిపి
ఇక్కడ అభ్యర్ధిని మార్చింది. జోగి రమేష్‌ను పెనమలూరు పంపించి, పెడనలో ఉప్పల రమేష్‌ను
మోహరించింది. ఎన్‌డిఎ తరఫున టిడిపి అభ్యర్ధిగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన
కాగిత వెంకట్రావు మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
తరఫున శొంఠి నాగరాజు బరిలో ఉన్నారు.