Gudivada
Assembly Constituency Profile
జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో అత్యంత వివాదాస్సద ఎమ్మెల్యేలలో కొడాలి నాని అగ్రగణ్యులు.
ప్రత్యర్థులను, ప్రత్యేకించి చంద్రబాబునాయుడును తిట్టడంలో ఆయన శైలి తీవ్ర విమర్శలకు
తావిచ్చింది. గత ఇరవై ఏళ్ళుగా ఆయన గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం
వహిస్తున్నారు.
కృష్ణా జిల్లాలోని గుడివాడ
శాసనసభా స్థానం 1951లో ఏర్పడింది. ఆ
నియోజకవర్గం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ.
గుడివాడలో మొదట్లో సిపిఐ
బలంగా ఉండేది. 1952, 1953, 1962 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచింది. 1955, 1967, 1972,
1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ పెట్టాక, ఆ
పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు 1983, 1985 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ
చేసి గెలిచారు. 1985లో ఎన్టీఆర్ మూడుచోట్ల పోటీ చేసి అన్నిచోట్లా గెలవడంతో గుడివాడలో
ఉపయెన్నిక అనివార్యమైంది. అప్పుడు కూడా తెలుగుదేశం అభ్యర్ధే గెలిచారు. 1989లో
కాంగ్రెస్ ఉనికి చాటుకున్నా, ఆ తర్వాత ఇప్పటివరకూ ఆ పార్టీ గెలవలేదు. 1994, 1999,
2000, 2004, 2009 వరకూ తెలుగుదేశం వరుసగా గెలుస్తూ వచ్చింది.
2004 ఎన్నికల్లో
తెలుగుదేశం తరఫున కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని కాంగ్రెస్
అభ్యర్ధి కటారి ఈశ్వర్ కుమార్ మీద గెలిచారు. 2009లో కొడాలి నాని మళ్ళీ తెలుగుదేశం
అభ్యర్ధిగా కాంగ్రెస్ అభ్యర్ధి పిన్నమనేని వెంకటేశ్వరరావు మీద విజయం సాధించారు.
2012లో నాని తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్‌సిపిలో చేరారు. 2014లో ఆయన
వైఎస్ఆర్‌సిపి నుంచి పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్ధి రావి వెంకటేశ్వరరావును
ఓడించారు. 2019లో టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసిన దేవినేని అవినాష్‌పై విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో కొడాలి
నాని వరుసగా ఐదోసారి, వైఎస్ఆర్‌సిపి తరఫున మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆయన
ప్రత్యర్ధిగా తెలుగుదేశం ఈసారి ఎన్‌డిఎ కూటమి తరఫున వెనిగండ్ల రామును మోహరించింది.
ఇక ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా వడ్డాది గోవిందరావు బరిలో నిలిచారు.