PM Modi
to Campaign in AP
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ జరిగే
మే 13 దగ్గర పడుతుండడంతో ప్రచార వేడి పెరుగుతోంది. ప్రధాన పార్టీలు వైఎస్ఆర్‌సిపి,
టిడిపి తమ మ్యానిఫెస్టోలు విడుదల చేసాక అభ్యర్ధులు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష
ప్రచారం చేస్తున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీల నేతలు కూడా ప్రచారం
చేస్తున్నారు.
పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్
శాసనసభకు కూడా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జేఎస్‌పీ కూటమిగా ఏర్పడిన
సంగతి తెలిసిందే. కూటమి తరఫున ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, దేశ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో మోదీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 7వ తేదీన రాజమండ్రిలో బీజేపీ
అభ్యర్ది పురందరేశ్వరికి మద్దతుగా మధ్నాహ్నం 3.30 గంటలకు వేమగిరిలో జరిగే సభలో
ప్రధాని మోదీ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 5.45 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని
రాజుపాలెం సభలో ప్రసంగిస్తారు. 8న సాయంత్రం 4 గంటలకు పీలేరులో ప్రచారం చేస్తారు.
అదేరోజు రాత్రి 7 గంటలకు విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు.
బీజేపీ ముఖ్య నేతలు పోటీ చేస్తున్న రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట
పార్లమెంట్ స్థానాలతో పాటు సుజనా చౌదరి పోటీ చేస్తున్న విజయవాడ పరిధిలో మోదీ ఎన్నికల
ప్రచారంలో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ
స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. దాన్ని విజయవంతం
చేయడానికి పార్టీ నేతలు భారీగా జన సమీకరణ ఎలా చేయాలన్న అంశంపై సమీక్షించారు.
మోడీతో పాటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాధిపతిపవన్
కళ్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారు.