Eluru
Parliamentary Constituency Profile
ఏలూరు లోక్‌సభా
నియోజకవర్గం ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో భాగంగా ఉండి, ఇటీవలే జిల్లాగా
ఏర్పడిన ఏలూరులోని ఒకేఒక పార్లమెంటరీ స్థానం. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.
ఏలూరు ఎంపీ సీటులో ఏడు
అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం (ఎస్టీ),
చింతలపూడి (ఎస్సీ), నూజివీడు, కైకలూరు.
ఏలూరు ఎంపీ స్థానంలో
1952 ఎన్నికల్లో సిపిఐ బోణీ చేసింది. 1962లో ఇంకోసారి ఆ పార్టీ గెలవగలిగింది.
1957, 1967, 1971, 1977, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1984లో
కొత్తపార్టీ తెలుగుదేశం గెలిచినా, 1989లో కాంగ్రెస్ తరఫున ప్రముఖ సినీనటుడు
ఘట్టమనేని కృష్ణ పోటీచేసి విజయం దక్కించుకున్నారు. 1991, 1996, 1999 ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధిగా బోళ్ళ బుల్లిరామయ్య గెలుపు సొంతం చేసుకున్నారు. 1998లోనూ, ఆ
తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన ఉనికి చాటుకుంది.
2014 ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధి మాగంటి వెంకటేశ్వరరావు సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్‌సిపికి
చెందిన తోట చంద్రశేఖర్ మీద విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం మళ్ళీ
మాగంటినే పోటీకి దింపింది. వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధిని మార్చి కోటగిరి శ్రీధర్‌ను
నిలిపి, గెలుపు సొంతం చేసుకుంది.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తమ అభ్యర్ధిగా కారుమూరి సునీల్‌కుమార్‌ను బరిలోకి దింపింది. సునీల్,
జగన్ ప్రభుత్వంలో బీసీ మంత్రిగా చేసిన కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు. అటు
తెలుగుదేశం కూడా బీసీ అభ్యర్ధిగా పుట్టా మహేష్ యాదవ్‌ను ఎన్‌డీఏ కూటమి తరఫున
పోటీకి పెట్టింది. మహేష్ యాదవ్, కడప జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు, మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా కావూరి లావణ్య
రంగప్రవేశం చేసారు. జంగారెడ్డి గూడేనికి చెందిన ప్రవాస భారతీయురాలైన లావణ్య ఇటీవలే
కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకున్నారు.