Kaikaluru
Assembly Constituency Profile
ఏలూరు జిల్లాలోని
కైకలూరు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నాలుగు
మండలాలు ఉన్నాయి. అవి మందవల్లి, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి.
కైకలూరు చాలాకాలం
కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. 1952, 1955, 1962, 1972, 1978, 1983, 1985, 1989,
1994, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులే విజయం సాధించారు. ప్రత్యేకించి 1978
నుంచి 1989 ఎన్నికలు అన్నింటిలోనూ కనుమూరి బాపిరాజు గెలుపు సొంతం చేసుకున్నారు.
1967లోనూ, 1999లోనూ మాత్రం స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. పార్టీ పెట్టిన తర్వాత
జరిగిన 1983, 1985 ఎన్నికల్లో దాదాపు అన్నిచోట్లా
గెలిచిన తెలుగుదేశం, కైకలూరు కోటను మాత్రం బద్దలుగొట్టలేకపోవడం గమనార్హం. ఆ
పార్టీ ఈ నియోజకవర్గంలో 2009లో ఒక్కసారి మాత్రమే గెలిచింది.
రాష్ట్ర విభజన తర్వాత
జరిగిన 2014 ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి కామినేని శ్రీనివాస్ వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి ఉప్పాల రాంప్రసాద్ మీద విజయం సాధించారు. ఆయన అంతకుముందు 2009లో
ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైఎస్ఆర్‌సిపి నిలబెట్టిన దూలం
నాగేశ్వరరావు, గతంలో తెలుగుదేశానికి ఒకేఒకసారి గెలుపు తెచ్చిపెట్టి, మళ్ళీ ఆ పార్టీ తరఫున పోటీ
చేసిన జయమంగళ వెంకటరమణను ఓడించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును నిలబెట్టింది. ఇక ఎన్‌డిఎ
కూటమి తరఫున ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి కామినేని శ్రీనివాసరావు మరోసారి పోటీ
పడుతున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బొడ్డు నోబెల్ బరిలోకి
దిగారు.