Denduluru
Assembly Constituency Profile
2014 తెలుగుదేశం
ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పదమైన ఎమ్మెల్యేల్లో చింతమనేని ప్రభాకర్ ఒకరు.
అంతకుముందు 2009లో కూడా గెలిచిన చింతమనేని, తన ప్రవర్తనతో ఎన్నోసార్లు వివాదాల్లో
ఇరుక్కున్నారు. 2019లో ఓటమి చవిచూసిన ఆయన ఇప్పుడు మళ్ళీ తన అదృష్టం పరిశీలించుకుంటున్నారు.
ఏలూరు జిల్లాలోని దెందులూరు
శాసనసభా నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆ స్థానం పరిధిలో నాలుగు మండలాలున్నాయి.
అవి దెందులూరు, పెదవేగి, పెదపర్రు, ఏలూరు మండలంలో కొంతభాగం.
దెందులూరులో 1955, 1967,
1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1962లో మాత్రం స్వతంత్ర
అభ్యర్ధి గెలిచారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది. 1989లోనూ, ఆ
వెంటనే జరిగిన 1991 ఉపయెన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత 1994,
1999 ఎన్నికల్లో తెలుగుదేశం సత్తా చాటింది. 2004లో కాంగ్రెస్ జెండా ఎగిరినా 2009,
2014 ఎన్నికల్లో మళ్ళీ సైకిల్ పుంజుకుంది. ఇక 2019లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి
గెలిచారు.
2009 ఎన్నికల్లో
చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం తరఫున పోటీ చేసారు. కాంగ్రెస్ అభ్యర్ధి కొఠారు
రామచంద్రరావును ఓడించారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టిడిపి
అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్, వైఎస్ఆర్సిపి అభ్యర్ధి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై
విజయం సాధించారు. 2019లో చింతమనేని మూడోసారి పోటీ చేసారు. కానీ ఆయన హ్యాట్రిక్
ప్రయత్నానికి వైఎస్ఆర్సిపి అభ్యర్ధి కొఠారు అబ్బయ్య చౌదరి దెబ్బకొట్టారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి నిలిపింది.
ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా చింతమనేని ప్రభాకర్ నాలుగోసారి పోటీ
చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆలపాటి నరసింహమూర్తి
నిలబడ్డారు.