Narasapuram Parliamentary Constituency Profile
ఈసారి
ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాల్లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచిన సీటు
నరసాపురం అంటే అతిశయోక్తి కాదు. సిట్టింగ్ ఎంపీ కనుమూరు రఘు రామకృష్ణ రాజు అలియాస్
ఆరారార్ వల్లే ఈ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షించిందని చెప్పవచ్చు.
పశ్చిమగోదావరి
జిల్లాలోని లోక్‌సభ స్థానం నరసాపురం. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటయింది. ఈ పార్లమెంటరీ
స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి ఆచంట, పాలకొల్లు, నరసాపురం,
భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం.
నరసాపురం ఎంపీ
స్థానంలో 1957లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ పార్టీ గెలిచింది. 1962, 1967, 1971,
1977, 1980 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. 1984, 1989, 1991,
1996 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్
గెలిచినప్పటికీ ఒక్క ఏడాదిలోనే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 1999లో భారతీయ జనతా పార్టీ
తరఫున ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజు పోటీ చేసి విజయం సాధించారు.
2004, 2009
ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో జరిగిన
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గోకరాజు గంగరాజు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి వంకా
రవీంద్రనాథ్ మీద గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కనుమూరి బాపిరాజు మూడో
స్థానానికి పరిమితమయ్యారు.
2019 ఎన్నికల్లో
వైఎస్ఆర్సిపి తరఫున కనుమూరు రఘు రామకృష్ణ రాజు తెలుగుదేశం అభ్యర్ధి వేటుకూరి
వెంకట శివరామరాజుతోనూ, జనసేన తరఫున ప్రముఖ సినీనటుడు నాగబాబుతోనూ పోటీ పడి విజయం
సాధించారు.
ఇప్పుడు 2024
ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరఫున గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి
తరఫున బిజెపి అభ్యర్ధిగా భూపతిరాజు శ్రీనివాసవర్మ బరిలోకి దిగారు. ఇండీ కూటమి
తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా కొర్లపాటి బ్రహ్మానంద నాయుడు నిలబడ్డారు.