తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22 నుంచి 24 వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. మే 21న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ జరగనుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు అని అధికారులు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా మే 23న ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాల సందర్భంగా శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
మే 21 నుంచి 24 వరకు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవ, మే 23న తిరుప్పావడ సేవ, మే 24న లక్ష్మీపూజ ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది.
భాష్యకార్ల ఉత్సవాలు ఎప్పటి నుంచి అంటే….
తిరుమల శ్రీవారి ఆలయంలో మే 3 నుంచి 21 వరకు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగనుంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని మే 12న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
అదే రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సాత్తుమొర నిర్వహిస్తారు.