జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట
స్వతంత్రులకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తమ పార్టీకి కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించకుండా ఈసీకి
ఆదేశాలు ఇవ్వాలంటూ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ
పిటిషన్లో కోరారు. ‘గాజు గ్లాసు’ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని
ఈసీకి వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.
రెండోసారి కూడా విన్నవించినప్పటికీ
ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదని న్యాయస్థానానికి తెలిపారు.
టీడీపీ, బీజేపీ,జనసేన పొత్తు కారణంగా.. ఈ గుర్తును
స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించటం వల్ల కూటమికి నష్టం జరుగుతుందని కోర్టుకు
తెలిపారు. జనసేన అభ్యర్ధనపై 24 గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం
తీసుకుంటుందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో విచారణ రేపటికి (బుధవారం) వాయిదా పడింది.
ఈ పిటిషన్ లో భాగంగా తాము కూడా వాదనలు వినిపిస్తామని టీడీపీ అనుబంధ పిటిషన్ దాఖలు
చేసింది.
పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21
అసెంబ్లీ స్థానాలు రెండు లోక్ సభ
స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగతా చోట్ల
మిత్ర పక్షాలు పోటీ చేస్తున్నాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థులకు అక్కడ గాజు గ్లాసు
కేటాయింపు జరుగుతోంది. దీనిపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఓటర్లు గందరగోళానికి
గురి అవుతారని రాజకీయంగా తమ కూటమికి నష్టం జరిగే అవకాశం ఉన్నందున జనసేనకు మాత్రమే
గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఆ పార్టీ కోరుతోంది.