కర్ణాటక లో దుమారం రేపుతున్న అశ్లీల వీడియోల వ్యవహారంలో జేడీ(ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ యువ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్టు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వెల్లడించారు.
విపక్షాలతో పాటు సొంతపార్టీ నేతల నుంచే నిరసనలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
వివాదం వెనక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపించిన కుమారస్వామి, ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా..? అవి అతడివేనన్న ఆధారం ఏంటని ప్రశ్నించారు.
వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు జరగాలన్నారు.
రేవణ్ణ మహిళలను వేధించినట్లు కొన్ని వీడియో క్లిప్పులో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లారు. ఈ విషయంలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు, జేడీఎస్ పై విరుచుకు పడుతున్నాయి. జేడీఎస్, ఎన్డీయే లో భాగస్వామిగా ఉండటంతో కూటమిని కూడా బద్నాం చేసేలా ఇండీ కూటమి పార్టీలు పసలేని విమర్శలు చేస్తున్నాయి