Undi Assembly Constituency Profile
ఈసారి
రాష్ట్రంలో ఆసక్తి కలిగించే నియోజకవర్గాల్లో ఉండి కూడా ముఖ్యమైనదే. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి
తరఫున గెలిచి, ఒక్క ఏడాదిలోపలే వైసీపీ రెబెల్‌గా తయారై, బహిరంగంగానే
తెలుగుదేశానికి మద్దతిస్తూ, అధికార పక్షం బనాయించిన కేసుల్లో పోలీసు దెబ్బలు తిని,
ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూలు విడుదల సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో
చేరి, ఇప్పుడు పచ్చజెండా చేతపుచ్చుకున్న కనుమూరు రఘు రామకృష్ణ రాజు అలియాస్
ఆర్ఆర్ఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం అది.
నిజానికి
ఆరారార్‌కు సీటు కేటాయించే విషయంలో చివరివరకూ తీవ్ర సందిగ్ధతే నెలకొంది. ఆయన
నరసాపురం లోక్‌సభా స్థానం ఆశించారు. పొత్తు లెక్కల్లో నరసాపురం స్థానాన్ని
బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. ఆ పార్టీలో చేర్పించి, రఘు రామకృష్ణ రాజుకు
బీజేపీ టికెట్ ఇప్పిద్దామని భావించారు. కానీ దానికి కమలం పార్టీ ఒప్పుకోలేదు. ఆ
పార్టీ తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మకు స్థానం దక్కింది. దాంతో ఆరారార్‌కు నిరాశే
మిగిలింది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్దీపరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
బీజేపీ ఎంతకూ తగ్గలేదు. దాంతో, జగనే బీజేపీని ప్రభావితం చేసి తనకు టికెట్
ఇవ్వకుండా ఆపించారంటూ రఘు రామకృష్ణ రాజు ఆరోపించారు కూడా.
చంద్రబాబు ఎట్టకేలకు
ఆరారార్‌ను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉండి నియోజకవర్గంలో తమ అభ్యర్ధి మంతెన
రామరాజును తప్పించి, రఘురామను నిలబెట్టారు. ఆ పరిణామంతో మంతెన కొంత ఉద్వేగానికి
లోనయ్యారు. నిజానికి మొదటి విడతలోనే తన పేరు ప్రకటించడంతో ముందుగానే ప్రచారం మొదలుపెట్టేసుకున్న
మంతెన రామరాజు, అభ్యర్ధి మార్పిడితో నిరాశకు గురయ్యారు. ఆరారార్‌కు టికెట్
ఇస్తారనే వార్తల నేపథ్యంలో రామరాజు అనుచరులు ఉండిలో నిరసనలు సైతం చేపట్టారు. అయితే
చంద్రబాబు మొత్తం మీద రామరాజును ఒప్పించగలిగారు.
పశ్చిమగోదావరి
జిల్లాలోని ఉండి నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఉండి నియోజకవర్గంలో ఐదు మండలాలు
ఉన్నాయి. అవి కాళ్ళ, పాలకోడేరు, ఉండి, ఆకివీడు, భీమవరం.
ఉండిలో ప్రధానంగా
కాంగ్రెస్, టిడిపిల హవాయే నడిచింది. 1952, 1955, 1962 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్
గెలిచింది. 1967లోనూ, 1970లో జరిగిన ఉపయెన్నికలోనూ స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1972,
1978 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది. ఇక 1983 నుంచి 2019 వరకూ జరిగిన
అన్ని ఎన్నికల్లోనూ అన్నిసార్లూ తెలుగుదేశమే గెలిచింది. మధ్యలో 2004లో ఒక్కసారి
కాంగ్రెస్ ఉనికి చాటుకుంది.
2019 ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధి మంతెన రామరాజు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి పివిఎల్ నరసింహరాజుపై
గెలిచారు. ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి మళ్ళీ నరసింహరాజునే నిలిపింది. ఎన్‌డిఎ
కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా కనుమూరు రఘు రామకృష్ణ రాజు పోటీ చేస్తున్నారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా వేగేశ వెంకట గోపాలకృష్ణం బరిలో నిలిచారు.