Bhimavaram
Assembly Constituency Profile
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం
నియోజకవర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. గత ఎన్నికల్లో జనసేన
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి, ఓడిపోయిన నియోజకవర్గం అది. భీమవరంతో
పాటు గాజువాకలో కూడా ఓడిపోయిన పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో పిఠాపురానికి
వెళ్ళిపోయారు. గాజువాకలో తెలుగుదేశం పోటీ చేస్తోంది కాబట్టి అక్కడ జనసేనకు ప్రస్తుతానికి
ఏ ప్రశ్నలూ లేవు. కానీ భీమవరంలో ఎన్‌డిఎ కూటమి తరఫున జనసేన అభ్యర్ధి బరిలో
ఉన్నారు. అందువల్లే ఆ స్థానం మీద ఆసక్తి నెలకొంది.
భీమవరం శాసనసభా నియోజకవర్గం 1951లో
ఏర్పాటైంది. ఆ స్థానంలో భీమవరం, వీరవాసరం మండలాలు ఉన్నాయి.
1952లో జరిగిన ఎన్నికల్లో కిసాన్
మజ్దూర్ పార్టీ గెలిచింది. 1955, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
1967లో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన భూపతిరాజు విజయకుమార్ రాజు 1972లో కాంగ్రెస్
తరఫున పోటీ చేసి గెలిచారు. 1978లో కాంగ్రెస్ పార్టీ కలిదిండి విజయనరసింహరాజును
బరిలోకి దింపి గెలుపు సొంతం చేసుకుంది. 1983, 1985, 1994, 1995, 1999 ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధిగా పెనుమత్స వెంకట నరసింహరాజు వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు.
మధ్యలో 1989లో ఒక్కసారి కాంగ్రెస్ నుంచి అల్లూరి సుభాష్ చంద్రబోస్ గెలిచారు.
ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్
విజయాన్ని చవిచూసింది. 2004లో కాంగ్రెస్ అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ విజయం
సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పులపర్తి రామాంజనేయులు గెలుపు సొంతం
చేసుకున్నారు.
2014లో రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో
పులపర్తి రామాంజనేయులు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్‌పై విజయం సాధించారు. 2019లో పులపర్తి టిడిపి టికెట్
పైన, గ్రంధి శ్రీనివాస్ వైఎస్ఆర్‌సిపి టికెట్ పైన పోటీ చేసారు. అప్పుడే
జనసేనపార్టీ తరఫున పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి
గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు.
2024 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్‌సిపి
తమ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌నే మళ్ళీ బరిలోకి దింపింది. భీమవరం
స్థానాన్ని పొత్తుల్లో జనసేనకు కేటాయించిన తెలుగుదేశం, తమ నాయకుడు పులపర్తి
రామాంజనేయులును ఆ పార్టీలోకి పంపించి, ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిపింది. ఇక
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా అంకెం సీతారాము బరిలో నిలిచారు.