ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ చనిపోయారు. కాంకేర్, నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది.
మావోయిస్టుల కదలికలపై స్పష్టమైన సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సోమవారం నుంచి వేట మొదలు పెట్టాయి. మహారాష్ట్ర సరిహద్దు తెక్‌మెట్ ప్రాంతంలో నక్సల్స్ సంచారంపై పోలీసులకు స్పష్టమైన సమాచారం అందింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ దళాలు జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఆపరేషన్ కొనసాగింది. బలగాలను చూసి మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.