Congress Indore MP
Candidate Joins BJP
కాంగ్రెస్ తమ పార్టీ నుంచి పోటీకి దిగిన మరో అభ్యర్ధిని కోల్పోయింది.
మధ్యప్రదేశ్‌లో నాలుగో దశ పోలింగ్‌లో ఎన్నిక జరిగే ఇందోర్ నియోజకవర్గం అభ్యర్ధి
అక్షయ్ కాంతి బమ్, పోటీ నుంచి ఉపసంహరించుకుని, బీజేపీలో చేరారు. గతవారం సూరత్‌లో కాంగ్రెస్
అభ్యర్ధి బీజేపీలో చేరాక, అలాంటి రెండో ఘటన ఇది.
మధ్యప్రదేశ్ బీజేపీలోని సీనియర్ నాయకుడు
కైలాష్ విజయవర్గీయ ఈ విషయాన్ని బైటపెట్టారు. కాంతి బమ్ తమతోపాటు కారులో ఉన్న చిత్రాన్ని ‘ఎక్స్’లో
ట్వీట్ చేస్తూ కైలాష్ విజయవర్గీయ ఆయన బీజేపీలో చేరారన్న సంగతిని ప్రకటించారు.
‘‘ఇందోర్ నుంచి
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధి అక్షయ్ కాంతి బమ్ గారికి – ప్రధానమంత్రి నరేంద్రమోదీ,
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మధ్యప్రదేశ్ బీజేపీ
అధ్యక్షుడు వీడీ శర్మల నేతృత్వంలో – బీజేపీలోకి స్వాగతం’’ అంటూ కైలాష్ ట్వీట్
చేసారు.
ఇందోర్
నియోజకవర్గానికి నాలుగో దశలో అంటే మే 13న పోలింగ్ జరగనుంది. అక్కడ నామినేషన్లు
దాఖలు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ.
‘‘కాంగ్రెస్
అభ్యర్ధి బమ్ సహా మొత్తం ముగ్గురు అభ్యర్ధులు తమ నామినేషన్లను సరైన పద్ధతిలో
ఉపసంహరించుకున్నారు. ఆ ప్రక్రియను వీడియోలో రికార్డు చేసాం’’ అని జిల్లా కలెక్టర్
ఆశిష్ సింగ్ మీడియాకు వెల్లడించారు.
అక్షయ్ బమ్ తన
నామినేషన్ ఉపసంహరణ కోసం కలెక్టర్ కార్యాలయానికి బిజెపి స్థానిక ఎమ్మెల్యే రమేష్
మెండోలాతో కలిసి వెళ్ళారు.
మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద
లోక్‌సభా నియోజకవర్గం అయిన ఇందోర్‌లో బీజేపీ తరఫున శంకర్ లల్వానీ పోటీ
చేస్తున్నారు. ఇందోర్‌లో అభ్యర్ధిని ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు పెద్ద సమస్యగా
నిలిచింది. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు సహా పలువురు నాయకులు కాంగ్రెస్‌ను
విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అలాంటి తరుణంలో కాంగ్రెస్ నాయకత్వం అక్షయ్ బమ్‌ను
ఎలాగోలా పోటీకి ఒప్పించింది. చివరికి ఆయన కూడా ఇవాళ కమలదళంలో కలిసిపోయారు.