కెనడా ప్రధాని ట్రూడోకు ఖలిస్థానీ నినాదాల సెగ తగిలింది.టొరంటోలో జరిగిన ఖల్సా దినోత్సవంలో ప్రధాని ట్రూడో ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. కెనడా రాజధాని టొరంటోలో ఆదివారంనాడు ఖల్సా డే పరేడ్ జరిపారు. ఈ వేడుకలకు ప్రధాని ట్రూడో సహా ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారు.
కెనడాలో స్థిరపడిపోయిన సిక్కులనుద్దేశించి ట్రూడో ప్రసంగిస్తుండగా ఖలిస్థాన్ మద్దతుదారులు నినాదాలు చేశారు. ఖిలిస్థాన్ జిందాబాద్ అంటూ వారు చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కెనడా ప్రధాని ట్రూడో వారి నినాదాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. సిక్కుల హక్కులను కాపాడటానికి కట్టుబడి ఉంటామని ట్రూడో హామీ ఇచ్చారు. భారత్, కెనడా మధ్య విమానాల రాకపోకలు పెంచుతామని చెప్పారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్త ముందంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్యపై కెనడా ప్రభుత్వం దర్యాప్తు చేసింది. కెనడా ప్రధాని ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.