Case registered
after doctored video of Amit Shah goes viral
ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు
రిజర్వేషన్లు తొలగించాలని కేంద్ర హోంమంత్రి చెబుతున్నట్లుగా ఎడిట్ చేసిన వీడియో
విస్తృతంగా ప్రచారమవుతోంది. ఆ అంశంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసారు. తప్పుడు
సమాచారాన్ని దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేయడం కోసమే ఆ వీడియోను రూపొందించారన్న
ఆరోపణల నేపథ్యంలో, దానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ ఫిర్యాదు
చేసింది.
ఆ వీడియో అసలైన వీడియో
కాదని, ఎడిట్ చేసిన వీడియో అనీ భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఒక
రాజకీయ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడిన మాటల అసలు భావాన్ని చెడగొట్టి తప్పుడు
అర్ధం వచ్చేలా వాక్యాలను కలిపి దురుద్దేశపూర్వకంగా ఎడిట్ చేసారని జేపీ మండిపడింది.
తెలంగాణలో ముస్లిముల
రిజర్వేషన్లను తొలగించేయాలనే అర్ధం వచ్చేలా అమిత్‌షా వ్యాఖ్యలను ఎడిట్ చేసారని
బిజెపి అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ చెప్పుకొచ్చారు. ‘‘ఒక ఎడిటెడ్ వీడియోను
కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అది పూర్తిగా తప్పుడు వీడియో. పెద్దస్థాయిలో
హింసాకాండకు దారితీసే సామర్థ్యం ఆ వీడియోకు ఉంది. ముస్లిములకు రాజ్యాంగవిరుద్ధంగా
ఇచ్చిన రిజర్వేషన్ల తొలగింపు గురించి మాత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. రిజర్వేషన్లలో ఎస్సీలు, ఎస్టీలు,
ఓబీసీల వాటాను తగ్గిస్తూ ముస్లిములకు రాజ్యాంగ విరుద్ధంగా ఇస్తున్న రిజర్వేషన్‌ను
మాత్రమే తొలగిస్తామని అమిత్ షా చెప్పారు. దాన్ని ముక్కలు ముక్కలు చేసి రూపొందించిన
నకిలీ వీడియోను కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పలువురు సమాజంలో
వ్యాపింపజేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి’’ అని
అమిత్ మాలవీయ ట్వీట్ చేసారు.
ఆ ఎడిటెడ్ వీడియోను వివిధ
సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారం చేయడం వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్
పార్టీకి చెందిన పలు అధికారిక ఖాతాలు సహా రకరకాల సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోను సర్క్యులేట్
చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోటాను నిర్మూలించడమే బీజేపీ అజెండా అంటూ
ప్రచారం చేస్తున్నారు. వాటిపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. సమాజంలోని
భిన్నవర్గాల మధ్య ఉన్న సుహృద్భావాన్ని దెబ్బతీసేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం
చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై ఆరోపిస్తున్నారు.
ఎఫ్ఐఆర్ నమోదయ్యాక
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు చెందిన ఇంటలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటెజిక్
ఆపరేషన్స్ విభాగం ఆ నకిలీ వీడియో మూలాలను గుర్తించడానికి పరిశోధన ప్రారంభించింది.