కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ మరోసారి మండిపడ్డారు. రాజులు, మహారాజులను అవమానించిన రాహుల్ గాంధీ, బుజ్జగింపు రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తాన్ల అరాచకాలపై మాత్ర మౌనం దాల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెళగావిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాలకు సంబంధించిన పుస్తకాలను కాంగ్రెస్ రాయించిందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ ఇప్పటికీ ఆ పాపాలు కొనసాగిస్తున్నారని దెప్పిపొడిచారు.
రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని వ్యాఖ్యానించిన రాహుల్, ఛత్రపతి శివాజీ మహారాజ్, కిత్తూరు రాణి చన్నమ్మాను అవమనించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ చరిత్రలో నవాబులు, నిజాంలు, సుల్తాన్లు, బాద్షాలు చేసిన దౌర్జన్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు అణచివేతల గురించి రాహుల్ మరచిపోయారా అని నిలదీశారు. దేవాలయాలను కలుషితం చేసి ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందన్నారు.