ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నేతలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జై చౌదరి, బలరామ్ యాదవ్, జగన్ జైశ్వాల్ ఇవాళ బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ వారిని బీజేపీలోకి ఆహ్వానించారు.
మాజీ ఎమ్మెల్యేతోపాటు, పలు జిల్లాల సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు కూడా బీజేపీలో చేరినట్లు బ్రజేష్ పాఠక్ తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పాఠక్ కోరారు. మోదీ పాలన ద్వారా వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు.
ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ సీట్లకు ఏడు దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19న యూపీలో 8 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో 8 స్థానాలకు ఏప్రిల్ 26న ముగిశాయి.