Nidadavole Assembly Constituency Profile
జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా తూర్పుగోదావరిలోకి
అద్దరి నుంచి వచ్చి చేరిన మరో ప్రధాన ప్రాంతం నిడదవోలు. ఆ నియోజకవర్గం 2008లో
ఏర్పడింది. నిడదవోలు స్థానం పరిధిలో మూడు మండలాలు ఉన్నాయి. అవి నిడదవోలు,
ఉండ్రాజవరం, పెరవలి.
ఈ స్థానం మొదట్లో అత్తిలి నియోజకవర్గంగా ఉండేది.
1955, 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1962లో సిపిఐ
ఒకసారి గెలిచింది. 1983, 1985, 1989 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం కైవసం చేసుకుంది.
1994లో కాంగ్రెస్ మరొకసారి ఉనికి చాటుకుంది. 1998 ఉపయెన్నికలోనూ, 1999 ఎన్నికలోనూ
తెలుగుదేశం సత్తా చాటింది. 2004లో చివరిసారి కాంగ్రెస్ గెలుపొందింది.
2008లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా
నిడదవోలు నియోజకవర్గంగా ఏర్పడింది. 2009లోనూ, ఆ తర్వాత 2014లోనూ జరిగిన ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధి బూరుగుపల్లి శేషారావు విజయం అందుకున్నారు. 2019లో వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి జి శ్రీనివాస నాయుడు గెలుపొందారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్‌సిపి తమ సిట్టింగ్
ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడునే బరిలోకి దింపుతోంది. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన అభ్యర్ధి
కందుల దుర్గేష్‌ను నిలబెట్టడం మాత్రం అనూహ్యమే. రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో
మొదటినుంచీ పనిచేసుకుంటూ ఆ టికెట్ తనకు ఖాయం అనుకున్న జనసేన నాయకుడు దుర్గేష్‌కు తెలుగుదేశం
పెద్ద దెబ్బే కొట్టింది. రాజమండ్ర రూరల్‌ను తమ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల
బుచ్చయ్య చౌదరికే కేటాయించింది. జనసేన దుర్గేష్‌ను ఏకంగా గోదావరి వంతెన దాటించి
నిడదవోలు వరకూ పంపించింది. దీంతో అక్కడి
స్థానిక తెలుగుదేశం నాయకత్వానికి కూడా అసంతృప్తే మిగిలింది. ఇక దుర్గేష్ గత
ఐదేళ్ళుగా రాజమండ్రి రూరల్‌లో పడిన ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. అయితే
నిడదవోలులో ఆయన శ్రమ ఫలిస్తుందో లేదో చూడాలి. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా పెద్దిరెడ్డి సుబ్బారావు కూడా పోటీలో ఉన్నారు.