Rajahmundry Rural Assembly Constituency Profile
రాజమండ్రి రూరల్ 2008 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో
ఏర్పడిన స్థానం. ఆ నియోజకవర్గంలో కడియం, రాజమండ్రి రూరల్ అనే రెండు మండలాలతో పాటు రాజమండ్రి
మునిసిపల్ కార్పొరేషన్‌లోని కొన్ని వార్డులు ఉన్నాయి.
1962లో కోరుకొండ నియోజకవర్గంగా ఉన్నప్పుడు
కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత కడియం నియోజకవర్గంగా మారింది. 1967, 1972
ఎన్నికల్లో కడియం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా కాంగ్రెస్ ఖాతాలో పడింది. 1978
నుంచీ జనరల్ స్థానంగా మారింది. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. 1983, 1985
ఎన్నికల్లో టిడిపి హవా నడిచింది. 1989లో జక్కంపూడి రామమోహనరావు ఇండిపెండెంట్
అభ్యర్ధిగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరినప్పటికీ 1994లో టిడిపి అభ్యర్ధి
వడ్డి వీరభద్రరావు చేతిలో ఓటమి తప్పలేదు. 1999, 2004లో మాత్రం జక్కంపూడి
రెండుసార్లూ గెలుపు దక్కించుకున్నారు.
2008లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో కడియం రద్దై
రాజమండ్రి రూరల్ కొత్త నియోజకవర్గం ఏర్పడింది. 2009లో టిడిపి అభ్యర్ధి చందన రమేష్
ప్రజారాజ్యం అభ్యర్ధి స్వామినాయుడును ఓడించారు. 2014లో టిడిపి తమ రాజమండ్రి
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రూరల్‌కు పంపించింది. ఆయన వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి ఆకుల వీర్రాజు మీద విజయం సాధించారు. 2019లో కూడా గోరంట్ల వెర్సెస్ ఆకుల
పోరులో టిడిపియే గెలిచింది.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గోరంట్లకు సీటు
దక్కుతుందా లేదా అన్న అనుమానాలుండేవి. జనసేన పార్టీకి చెందిన కందుల దుర్గేష్‌కు
రాజమండ్రి రూరల్ టికెట్ దక్కుతుందని భావించారు. అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు
మళ్ళీ గోరంట్లకే సీటిచ్చారు. ఇక వైఎస్ఆర్‌సిపి తమ అభ్యర్ధిని మార్చింది. రామచంద్రాపురం
నుంచి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను మోహరించింది. ఇండీ కూటమి తరఫున
కాంగ్రెస్ అభ్యర్ధిగా బాలేపల్లి మురళీధర్ నిలబడ్డారు.