Anaparthi Assembly Constituency Profile
తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గం
రెడ్డి సామాజికవర్గానికి చిరునామా. దానికి తగినట్లే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో
దాదాపు వారే ఎప్పుడూ గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా అదే కథ పునరావృతమవుతోంది.
అనపర్తి నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ
స్థానంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి పెదపూడి, బిక్కవోలు, రంగంపేట, అనపర్తి.
1952లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున
పడాల సత్యనారాయణరెడ్డి గెలిచారు. 1955లో ప్రజాపార్టీ అభ్యర్ధిగా తేతల లక్ష్మీనారాయణరెడ్డి
గెలుపొందారు. 1962లో సిపిఐ అభ్యర్ధి పాలచర్ల పనసరామన్న గెలిచారు. 1967, 1972
ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వల్లూరి రామకృష్ణ చౌదరి విజయం సాధించారు. 1978లో జనతా
పార్టీ నుంచి పడాల అమ్మిరెడ్డి గెలిచారు. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో
తెలుగుదేశం అభ్యర్ధిగా నల్లమిల్లి మూలారెడ్డి గెలిచారు. మధ్యలో 1989లోనూ, తర్వాత
2004లోనూ కాంగ్రెస్ నుంచి తేతలి రామారెడ్డి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్
అభ్యర్ధిని మార్చి, నల్లమిల్లి శేషారెడ్డిని నిలబెట్టి గెలుపు దక్కించుకుంది.
2014లో తెలుగుదేశం అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
వైఎస్ఆర్సిపి అభ్యర్ధి సత్తి సూర్యనారాయణ రెడ్డిపై విజయం సాధించారు. 2019లో వాళ్ళిద్దరే
మళ్ళీ తలపడ్డారు. ఈసారి వైఎస్ఆర్సిపి గెలుపు సొంతం చేసుకుంది.
2024లో వైఎస్ఆర్సిపి తమ సిట్టింగ్ ఎమ్మెల్యే సత్తి
సూర్యనారాయణ రెడ్డినే బరిలోకి దింపింది. ప్రతిపక్షం విషయంలోనే చాలా డ్రామా
నడిచింది. ఎన్డిఎ పొత్తుల్లో భాగంగా అనపర్తి స్థానం బీజేపీకి కేటాయించారు. అయితే
అక్కడ టిడిపి నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ తనే పోటీ
చేస్తానని పట్టుపట్టుకుని కూచున్నారు. మిత్రపక్షాలైన జనసేన, బిజెపి ఎవరిని
నిలబెట్టినా ఒప్పుకోనని పంతం పట్టారు. దాంతో టిడిపి ఒక దశలో బిజెపిని స్థానం
మార్చుకోమని, రాయలసీమలోని రాజంపేట నియోజకవర్గం తీసుకొమ్మనీ అడిగింది. అయితే దానికి
బిజెపి ఒప్పుకోలేదు. అక్కడ తమ అభ్యర్ధి నల్లమిల్లి శివరామకృష్ణంరాజును అప్పటికే ప్రకటించేసామనీ,
అప్పటికప్పుడు నియోజకవర్గం మార్చుకోబోమనీ బీజేపీ తేల్చి చెప్పింది. అయితే
చంద్రబాబునాయుడు తన తెలివితేటలన్నీ ఉపయోగించి అనపర్తిలో పోటీ చేసే పార్టీని అలాగే
ఉంచి అభ్యర్ధిని మాత్రం మార్చేయించగలిగారు.
తెలుగుదేశం నాయకుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అప్పటికప్పుడు బీజేపీలోకి మారిపోయారు. బీజేపీ అభ్యర్ధి తాను ఎన్నికల బరిలోనుంచి
తప్పుకున్నారు. కొత్త అభ్యర్ధి రామకృష్ణారెడ్డి బిజెపి జెండా మీద నామినేషన్ దాఖలు
చేసారు. ఇక ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా డాక్టర్ ఎల్లా శ్రీనివాసరావు పోటీ
చేస్తున్నారు.