Madras HC declares TN Waqf Act amendment unconstitutional
తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె
ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 1995 నాటి వక్ఫ్ బోర్డ్ చట్టానికి చేసిన
తమిళనాడు ప్రభుత్వం సవరణను మద్రాస్ హైకోర్ట్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
వక్ఫ్ భూములను ఆక్రమించుకునే వారిని ఖాళీ చేయించే
అధికారాలను వక్ఫ్ బోర్డ్ సిఇఓకు కట్టబెడుతూ డిఎంకె సర్కారు చేసిన చట్టం రాజ్యాంగానికి
విరుద్ధంగా ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన వక్ఫ్
చట్టం 1995 కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం. దాన్ని 2010లో అప్పటి డిఎంకె ప్రభుత్వం
సవరించింది. తమ రాష్ట్రంలోని వక్ఫ్ భూములను తమిళనాడు పబ్లిక్ ప్రెమిసెస్ (ఎవిక్షన్
ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్) చట్టం 1976 పరిధిలోకి తీసుకొచ్చింది. తద్వారా వక్ఫ్
భూములను ఆక్రమించుకుని నివసిస్తున్న వారిని ఖాళీ చేయించే అధికారం వక్ఫ్ బోర్డ్
సిఇఒకు దఖలు పరిచింది.
వక్ఫ్ చట్టం 1995కు డిఎంకె ప్రభుత్వం 2010లో
చేసిన ఆ సవరణ రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ వి గంగాపూర్‌వాలా,
జస్టిస్ భారత చక్రవర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా ఏప్రిల్ 24న
ప్రకటించింది. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించే అధికారం కేంద్ర
చట్టానికి 2013లో చేసిన సవరణ ప్రకారం ఏర్పాటు చేసిన వక్ఫ్ ట్రైబ్యునల్స్‌కు
మాత్రమే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర చట్టాలు వాటికంటె ముందు చేసిన
కేంద్ర చట్టాలను ధిక్కరించలేవన్న న్యాయసూత్రాన్ని గుర్తుచేసింది.
ఈ కేసులో తీర్పునిచ్చే సందర్భంలో జస్టిస్ భారత
చక్రవర్తి ఇలా చెప్పారు ‘‘వక్ఫ్ చట్టం 1995లోని అంశాలు వక్ఫ్ ఆస్తుల దురాక్రమణ
లేదా చట్టవిరుద్ధ ఆక్రమణపై కఠినంగా వ్యవహరించలేదు. అందువల్ల, పబ్లిక్ ప్రెమిసెస్
(ఎవిక్షన్ ఆఫ్ అనాదరైజ్డ్ ఆక్యుపెంట్స్) యాక్ట్ 1971ను వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు కూడా
వర్తింపజేయాలని సచార్ కమిటీ సిఫారసు చేసింది. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు కూడా ప్రజా
ఉపయోగం కోసమే కాబట్టి ఆ చట్టాన్ని వర్తింపజేయాలన్నది సచార్ కమిటీ సలహా. తమిళనాడు ప్రభుత్వం 2010లో సవరణ చేసింది కానీ
మరే ఇతర రాష్ట్రాలూ చేయలేదు. ఆ నేపథ్యంలో 2013లో పార్లమెంటు వక్ఫ్ చట్టాన్ని
సవరించింది. ఆక్రమణలను ఖాళీ చేయించే విషయంలో దేశమంతా ఒకే పద్ధతి ఉండడం కోసం ఆ సవరణ
చేసింది. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులను ఖాళీ చేయిండం కేంద్రప్రభుత్వం నిర్దేశించిన
పద్ధతిలో మాత్రమే సాధ్యమవుతుంది’’ అని వివరించారు.
తమిళనాడులో వక్ఫ్ బోర్డు చాలాచోట్ల హిందువుల
భూములను, ఆలయాల ఆస్తులను తమ సొంతమని ప్రకటిస్తోంది. 2022లో తిరుచ్చెందురై గ్రామంలో
ఒక వ్యక్తి తన భూమిని అమ్ముకోడానికి ప్రయత్నించినప్పుడు అతన్ని వక్ఫ్ బోర్డు నుంచి
నిరభ్యంతర పత్రం తీసుకురమ్మని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఆ గ్రామంలోని భూములన్నీ
వక్ఫ్ బోర్డుకు చెందినవనీ, వాటిని ఎవరైనా అమ్ముకోవాలంటే చెన్నైలోని వక్ఫ్ బోర్డ్
కార్యాలయం నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలనీ ఆదేశించారు. అప్పుడే సామాన్య ప్రజల
ఆస్తిపాస్తులను వక్ఫ్ బోర్డు ఎలా లాక్కుంటోందన్న విషయం బైటపడింది. దాంతో వక్ఫ్‌బోర్డ్ తనకుతాను ఇఛ్చుకున్న అపరిమిత
అధికారాల సంగతి తెలిసి, తిరుచ్చుందురై గ్రామవాసులు షాక్ అయ్యారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో మఠాలు,
మందిరాల భూములను పునఃపంపిణీ చేస్తామని చెప్పుకొచ్చింది. కానీ ఆ పార్టీ వక్ఫ్
భూములు, చర్చి భూముల గురించి మాట మాత్రమైనా మాట్లాడడం లేదు.