Huge cache of arms caught in Sandeshkhali, TMC leader
implicated
కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పశ్చిమబెంగాల్లోని
సందేశ్‌ఖాలీలో జరిపిన సోదాల్లో మారణాయుధాలు, నాటు బాంబులు, ఇతర పేలుడు పదార్ధాలు భారీ
మొత్తంలో లభ్యమయ్యాయి. జనవరిలో ఈడీ అధికారులపై స్థానిక టిఎంసి నేతల దాడి కేసు
దర్యాప్తులో భాగంగా నిన్న ఏప్రిల్ 26న సిబిఐ నిర్వహించిన సోదాల్లో ఈ ఆయుధాలు
లభ్యమయ్యాయి.
సందేశ్‌ఖాలీలోని సర్వేబరియా ప్రాంతంలో స్థానిక
తృణమూల్ కాంగ్రెస్ నేత హఫీజుల్ ఖాన్ సమీప బంధువు అబూ తాలెబ్ ఇంట్లో సిబిఐ జరిపిన
సోదాల్లో ఈ మారణాయుధాలు పట్టుబడ్డాయి. జనవరి 5న తృణమూల్ నేత షేక్ షాజహాన్ నివాసంలో
సోదాలు చేయడానికి వెడుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం మీద ఆయన అనుచరులు
దాడి చేసారు. షేక్ షాజహాన్‌కు, హఫీజుల్ ఖాన్‌కూ సన్నిహిత సంబంధాలున్నాయి.
ఆ కేసును విచారిస్తున్న సిబిఐ, శుక్రవారం నాడు
సిఆర్పిఎఫ్ బలగాల సహాయంతో సోదాలు చేసింది. ఆ క్రమంలో మూడు ఫారిన్ మేడ్
రివాల్వర్లు, ఒక దేశీయ రివాల్వర్, ఒక పోలీస్ రివాల్వర్, పెద్దమొత్తంలో బులెట్లు లభించాయి.
ఇంకా షేక్ షాజహాన్ నేరాలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు కూడా దొరికాయి.
ఈ సోదాల్లో పెద్దసంఖ్యలో స్థానికంగా తయారుచేసిన
నాటుబాంబులు దొరికాయి. వాటిని నిర్వీర్యం చేయడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్
విభాగానికి చెందిన బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది.
ఈ సంఘటనపై పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి
తీవ్రంగా స్పందించారు. షేక్ షాజహాన్, హఫీజుల్ ఖాన్, అబూతాలెబ్ వంటివారిని
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెనకేసుకొస్తున్నారని, వారిని రక్షించేందుకు తీవ్రంగా
శ్రమిస్తున్నారనీ మండిపడ్డారు. సందేశ్‌ఖాలీలో ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్ఎస్జి వంటి
భద్రతా బలగాలను మోహరిస్తుండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు.
సందేశ్‌ఖాలీలో ఆర్థిక
అక్రమాలకు పాల్పడుతుండడం మాత్రమే కాక హిందూ మహిళలపై వ్యూహాత్మకంగా సామూహిక
అత్యాచారాలకు పాల్పడుతున్న బృందానికి నాయకుడైన షేక్ షాజహాన్‌ను మమతా బెనర్జీ
ప్రభుత్వం 55 రోజుల పాటు కాపాడింది. తర్వాత హైకోర్టు మొట్టికాయలతో అతన్ని అరెస్ట్
చేయక తప్పలేదు.