ఈవీఎంల
పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తొసిపుచ్చింది.
ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో క్రాస్
చెక్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఏ
వ్యవస్థనైనా గుడ్డిగా సందేహించడం సరికాదన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం, అనవసరంగా అనుమానాలు రేకిత్తించడం
సరికాదని హితవు పలికింది.
ఇతర దేశాల్లోని ఎన్నికల ప్రక్రియతో పోలుస్తూ 100 శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించడం చాలా
క్లిష్టమైనదని పేర్కొంది. జస్టిస్ సంజీవ్
ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన
ద్విసభ్య ధర్మాసనం విడివిడిగా రెండు తీర్పులు వెలువరించినప్పటికీ ఏకాభిప్రాయం
వ్యక్తమైంది.
ప్రస్తుతం
ఓ అసెంబ్లీ స్థానం పరిధిలోని ఐదు ఈవీఎంలను
ఎంపికచేసి వాటిలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి
చూస్తున్నారు. అలా కాకుండా వీవీప్యాట్ స్లిప్పులు అన్నింటినీ లెక్కించాలని
పిటిషనర్లు కోరారు.
ఓటింగ్
సమయంలో వీవీప్యాట్ నుంచి వచ్చే స్లిప్పును ఓటరు చేతికే ఇవ్వాలని, ఓటు సక్రమంగా నమోదైందో లేదో చూసిన
తర్వాతే బ్యాలెట్ బాక్సులో దానిని వేసేందుకు అనుమతించాలని పిటిషనర్లు కోరగా
ధర్మాసనం తిరస్కరించింది. ఓటరు చేతికి వీవీప్యాట్ స్లిప్పు ఇస్తే ఇతర సమస్యలు
తలెత్తే అవకాశముందని హెచ్చరించింది.
పేపర్
బ్యాలట్ విధానానికే వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలన్న వినతికీ ధర్మాసనం సమ్మతించలేదు.
ఈవీఎం విధానంలోని లోపాలను ఎత్తిచూపి మెరుగుపరచుకునే సూచనలివ్వక పోగా అపోహలు
సృష్టించడం సరికాదని తేల్చి చెప్పింది. కాల పరీక్షకు ఈవీఎంలు నెగ్గాయని ధర్మాసనం
అభిప్రాయపడింది.
ఈవీఎంలు దుర్వినియోగమైనట్లు పిటిషనర్లు ఒక్క ఉదాహరణ కూడా చూపలేకపోయారని ధర్మాసనం పేర్కొంది.
వీవీప్యాట్ల
స్లిప్పులను 100 శాతం క్రాస్ చెక్ చేయాలనే రాజకీయ
పార్టీల వాదనలు సుప్రీకోర్టు తిరస్కరించినప్పటికీ, ఎన్నికల సంఘానికి రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మే ఒకటో తేదీ నుంచి ఈవీఎంల్లో అభ్యర్థుల గుర్తుల
లోడింగ్ ప్రక్రియ తర్వాత యూనిట్లను సీల్ చేయాలని తెలిపింది. ఫలితాలు వెల్లడైన
తర్వాత కనీసం 45 రోజుల వరకు స్ట్రాంగ్ రూముల్లో
భద్రపర్చాలని పేర్కొంది.
ఓడిన అభ్యర్థులకు
అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోపు తెలియజేయాలని పేర్కొంది.
అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇంజినీర్ల బృందం 5శాతం
ఈవీఎంలలోని మైక్రోకంట్రోలర్ చిప్‌లను తనిఖీ చేయవచ్చని వెల్లడించింది. అయితే
అందుకయ్యే ఖర్చులను ఫిర్యాదు దారులే భరించాలని వెల్లడించింది. ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులను వారికి తిరిగి ఇవ్వాలని స్పష్టం
చేసింది. ప్రతీ అభ్యర్థి ఎన్నికల గుర్తుతో పాటు బార్ కోడ్ ఏర్పాటుకు ఉన్న
అవకాశాన్నీ పరిశీలించాలని జస్టిస్ దీపాంకర్ సూచించారు.
వీవీ
ప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పును ప్రధాని మోదీ స్వాగతించారు.
విపక్షాలకు చెంపపెట్టు లాంటి తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించిందన్నారు.
కాంగ్రెస్ సహా విపక్ష ‘ఇండీ’ కూటమి పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు
ఎన్నికల్లో లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించిన మోదీ, అప్పట్లో
బలవంతులదే రాజ్యమన్నారు. పేదలు, దళితులు, గిరిజనులకు ఓటు వేసే అవకాశం ఉండేది
కాదు అన్నారు. ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత విపక్షాల ఆటలు సాగడం లేదన్నారు.