Amalapuram
Parliamentary Constituency Profile
గోదావరి కొసన ఉన్న సీమ
కాబట్టి దాన్ని కోనసీమ అన్నారు. అమలాపురం ఆ కోనసీమకు చిరునామా లాంటి నగరం. అమలాపురం
పార్లమెంటరీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.
అమలాపురం లోక్‌సభా స్థానంలో
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం,
రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట.
అమలాపురం లోక్‌సభ నియోజకవర్గానికి
1957లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ గెలిచింది. ఆ తర్వాత అంతా కాంగ్రెస్, టిడిపిల
పాలనే నడిచింది. గత ఎన్నికల్లో అంటే 2019లో వైఎస్ఆర్‌సిపి బోణీ చేసింది.
1962, 1967, 1971, 1977,
1980 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొదటి
లోక్‌సభ ఎన్నికలు జరిగిన 1984లో ఆ పార్టీ గెలిచింది. 1989లో కాంగ్రెస్ పుంజుకున్నా
1991లో తెలుగుదేశానికి వదిలేసుకుంది. ఆ సంవత్సరం జిఎంసి బాలయోగి మొదటిసారి ఎంపీగా
పార్లమెంటులో అడుగుపెట్టారు. 1996లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచినా 1998, 1999లో జరిగిన
ఎన్నికల్లో బాలయోగి మళ్ళీ టిడిపి ఎంపీగా విజయం సాధించారు. 2002లో టిడిపి తరఫున
గంటి విజయకుమారి ఎంపీ సీటు దక్కించుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో జివి
హర్షకుమార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా నిలిచి గెలిచారు.
రాష్ట్ర విభజన తర్వాత
జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి పండుల రవీంద్రబాబు వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధి పినిపే విశ్వరూపు మీద విజయబావుటా ఎగరేసారు. 2019లో రెండు ప్రధాన పార్టీలూ
తమ అభ్యర్ధులను మార్చాయి. వైఎస్ఆర్‌సిపి తరఫున చింతా అనూరాధ తెలుగుదేశానికి చెందిన
గంటి హరీష్ మాధుర్ మీద గెలుపొందారు.
ఇప్పుడు 2024లో అధికార వైఎస్ఆర్‌సిపి తమ అభ్యర్ధిని మార్చింది. రాజోలు సిట్టింగ్
ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును పార్లమెంటు బరిలో మోహరించింది. ఎంపీగా పోటీ చేయడం
ఇష్టం లేదంటూనే రాపాక నామినేషన్ కూడా వేసేసారు. ఎన్‌డిఎ కూటమిలోని తెలుగుదేశం
మాత్రం గతేడాది పోటీ చేసిన గంటి హరీష్ మాధుర్‌నే నిలబెడుతోంది. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
నాయకుడైన జంగా గౌతమ్ బరిలోకి దిగారు.