ఎన్నికల
దగ్గర పడుతున్న కొద్దీ ఆయారాం, గయారాంల హడావుడి అంతా ఇంతా కాదు. అప్పటి వరకు తాము
ఉన్న పార్టీని వేనోళ్ళ పొగిడిన నేతలు టికెట్ దక్కలేదని కొందరు, ప్రాధాన్యంలేదని
మరికొందరు పార్టీలు వీడుతున్నారు. అప్పటివరకు తిట్టిన పార్టీలోకే పొలోమని
చేరుతున్నారు.
తాజాగా
టీడీపీ అగ్రనేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడైన యనమల కృష్ణుడు పార్టీ
మారారు. గత రెండు దఫాలుగా సైకిల్ గుర్తుపై అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన కృష్ణుడికి ఈ సారి టీడీపీ టికెట్
దక్కలేదు. యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య ఈసారి పోటీలో ఉన్నారు. దీంతో యనమల
కృష్ణుడు పార్టీ మారారు. తనపై కావాలనే
దుష్ప్రచారం చేసి టికెట్ దక్కకుండా కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.సీఎం
జగన్ ఆహ్వానం మేరకే వైసీపీలో
చేరుతున్నట్లు ప్రకటించారు. తునిలో వైసీపీ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తానని చెప్పారు.
ఇక
మాజీమంత్రి, గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీని
వీడారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(రిజర్వుడు) స్థానం
నుంచి సైకిల్ గుర్తు పై పోటీ చేసిన మాణిక్య వరప్రసాద్, వైసీపీ అభ్యర్థి మేకతోటి
సుచరిత చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రకటన సమయంలో టీడీపీకి, ఆ
పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు.
తాడికొండ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు నిరాశ
ఎదురైంది.
తాడికొండ నుంచి ఫ్యాన్ గుర్తుపై మాజీ మంత్రి సుచరిత పోటీ చేస్తున్నారు. దీంతో తనకు
ప్రాధాన్యం దక్కడం లేదంటూ మాణిక్య వరప్రసాద్ కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు.
నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్
ప్రభుత్వం లో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రి వర్గంలో డొక్కా మాణిక్య ప్రసాద్ పనిచేశారు.