P Gannavaram Assembly Constituency Profile
అమలాపురం జిల్లాలోని రిజర్వుడు నియోజకవర్గాల్లో
పి(పాత) గన్నవరం ఒకటి. 2008లో ఏర్పడిన ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయి ఉంది. ఈ
స్థానం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి
మండలాలు పూర్తిగానూ మామిడికుదురు మండలంలో కొంతభాగమూ పి గన్నవరం నియోజకవర్గం
పరిధిలోకి వస్తాయి.
మొదట్లో నగరం పేరుతో శాసనసభా నియోజకవర్గం 1962 నుంచీ
ఉండేది. అప్పుడు 1962, 1967, 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు
గెలిచారు. 1983, 1985లో తెలుగుదేశం గెలిచింది. 1989లో ఒకసారి కాంగ్రెస్ విజయం
సాధించాక మళ్ళీ 1994లో టిడిపి గెలుపు దక్కించుకుంది. 1999లో వాజ్‌పేయీ వేవ్‌లో
ఆంధ్రప్రాంతంలో బిజెపి అభ్యర్ధి మానేపల్లి అయ్యాజీవేమా విజయం సాధించారు. తర్వాత 2004,
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పి రాజేశ్వరీదేవి గెలిచారు. 2009 నుంచీ పి
గన్నవరం నియోజకవర్గం అమల్లోకి వచ్చింది.
2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో
వైఎస్ఆర్సిపి అభ్యర్ధి కె చిట్టిబాబు మీద తెలుగుదేశం అభ్యర్ధి పి నారాయణమూర్తి
విజయం సాధించారు. 2019లో తెలుగుదేశం అభ్యర్ధి నేలపూడి స్టాలిన్ బాబు మీద వైఎస్ఆర్సిపి
అభ్యర్ధి కొండేటి చిట్టిబాబు గెలుపొందారు.
ఇప్పుడు 2024లో ప్రధాన
పార్టీలు మళ్ళీ కొత్త అభ్యర్ధులను బరిలోకి దించాయి. వైఎస్ఆర్సిపి తరఫున విప్పర్తి
వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్ధి గిడ్డి
సత్యనారాయణ బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ఈసారి
వైసీపీ అవకాశం కల్పించకపోవడంతో ఆయన పార్టీ మారారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.