Razole Assembly Constituency Profile
గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం ఒక ప్రత్యేకతను
సాధించింది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సహా జనసేన అభ్యర్ధులందరూ డిపాజిట్లు కోల్పోయిన
వేళ ఆ పార్టీ గెలిచిన ఒకేఒక స్థానంగా రాజోలు నిలిచింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ
అభ్యర్ధి వైఎస్‌ఆర్‌సిపి అనుకూలుడిగా మారిపోవడం అనూహ్యమేమీ కాదు. ఇప్పుడు అదే
రాజోలులో ఎన్‌డిఎ కూటమి తరఫున మళ్ళీ జనసేన
పార్టీయే పోటీ చేస్తుండడం విశేషం.
రాజోలు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఎస్సీలకు
రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. రాజోలు, మలికిపురం,
సఖినేటిపల్లె మండలాలు పూర్తిగానూ, మామిడికుదురు మండలంలో కొంత భాగమూ ఈ
నియోజకవర్గంలో ఉన్నాయి.
రాజోలులో 1952, 1955 ఎన్నికల్లో సిపిఐ బోణీ
చేసింది. 1962, 1967, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1972లో
స్వతంత్ర అభ్యర్ధి గెలిచారు. 1983, 1985లో తెలుగుదేశం రంగప్రవేశం చేసింది. 1989లో
కాంగ్రెస్ గెలిచినా 1994, 1999లో తెలుగుదేశం ఆధిక్యం నిలబెట్టుకుంది. 2004, 2009లో
కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014లో రాష్ట్ర విభజన ఫలితంగా టిడిపి నుంచి
గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావుపై గెలిచారు.
2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాపాక
వరప్రసాదరావు రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీని వీడారు. 2014లో స్వతంత్ర అభ్యర్ధిగా
పోటీ చేసారు. 2019లో వైఎస్ఆర్‌సిపి టికెట్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
దాంతో జనసేన అభ్యర్ధిగా బరిలో దిగారు. ఆ ఎన్నికలో తెలుగుదేశం నుంచి గొల్లపల్లి
సూర్యారావు, వైఎస్‌ఆర్‌సిపి నుంచి బొంతు నాగేశ్వరరావు పోటీ చేసారు. అందరి అంచనాలనూ
తలకిందులు చేస్తూ జనసేన తరఫున రాపాక వరప్రసాదరావు గెలిచారు. ఎన్నికల తర్వాత ఆయన
వైఎస్ఆర్‌సిపికి అనుకూలంగా ఉండసాగారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధిగా అమలాపురం
ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికలకు అధికార వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధిగా గొల్లపల్లి సూర్యారావు పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన
అభ్యర్ధిగా దేవవరప్రసాద్ నిలబడ్డారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా
సరెళ్ళ ప్రసన్నకుమార్ పోటీ చేస్తున్నారు.