కాంగ్రెస్
పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల స్వభావం ఒక్కటేనని ప్రధాని నరేంద్రమోదీ
అన్నారు. ఇరుపార్టీలు గొడవ పడుతున్నట్లు కనపడినప్పటికీ ఆ రెండూ ఒక్కటేనని
విమర్శించారు. పశ్చిమబెంగాల్లోని మాల్దాలో
బీజేపీ ఆధర్వంలో చేపట్టిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ, రాజకీయ లబ్ధి
కోసం ఆ రెండు పార్టీలు ఏం చేసేందుకైనా వెనుకాడవని అన్నారు.
దేశ
భద్రత కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తిరగతోడాలని కాంగ్రెస్, టీఎంసీలు
కోరుకుంటున్నాయన్నారు. ఆర్టికల్ 370
పునరుద్ధరించాలని ఇండీ కూటమి కోరుకుంటోందని, సీఏఏను రద్దు చేస్తామని టీఎంసీ ప్రకటించిన విషయాన్ని మోదీ గుర్తు
చేశారు.
ప్రజల
ఆస్తులు స్వాధీనం చేసుకుని వాటిలో కొంత భాగాన్ని ఓటు బ్యాంకుకు పంచాలని చూస్తున్నారని
ఆరోపించారు.
బిహార్
లో అరారియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ఈవీఎంల పనితీరుపై ప్రతిపక్షాలు
చేస్తున్నఆరోపణలకు సుప్రీంకోర్టు తీర్పుతో గట్టి చెంపదెబ్బ తగిలిందన్నారు. భారత ప్రజాస్వామ్య
విలువలను, ఎన్నికల ప్రక్రియను యావత్ ప్రపంచం కొనియాడుతోందన్నారు. విపక్షాలు
మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని కించపరుస్తున్నారని దుయ్యబట్టారు. బ్యాలెట్
బాక్సులను దోచుకోవాలని కలలు కంటున్న వారి కుట్రలను సుప్రీంకోర్టు తీర్పు భగ్నం చేసిందన్నారు. . ఇది ప్రజాస్వామ్యానికి
దక్కిన విజయమని మోదీ అభిలాషించారు.