ఈవీఎంల్లో
నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు సరిపోల్చి లెక్కించాలనే
పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను
కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం
ప్రకటించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 24న వాదనలు ముగియగా ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు(
శుక్రవారం ) తీర్పును వెలువరించింది.
ఈవీఎంలలో
నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలని సుప్రీంకోర్టులో
పిటిషన్ దాఖలైంది. పిటిషన్ విచారణ సందర్భంగా ఏప్రిల్ 24న న్యాయస్థానం కీలక
వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల
ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం పనితీరును
తాము నిర్దేశించలేమని తేల్చి చెప్పింది.
ఎన్నికల
ఫలితాల లెక్కింపు సమయంలో ఈవీఎంలో పోల్ అయిన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను క్రాస్
చెక్ చేయాలంటూ పిటిషన్ కోరారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు
కొన్ని ప్రశ్నలు సంధించింది.
ఈవీఎంలో
మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించిన న్యాయస్థానం, అది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా? అన్నది నిర్ధారించాలని సూచించింది.
న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈసీ అధికారులు
న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. కేవలం అనుమానాలను ఆధారం చేసుకుని ఎలాంటి
ఉత్తర్వులు జారీ చేయలేమని సుప్రీంకోర్టు చెప్పింది.