Hamas agrees to dissolve group if Israel accepts two
state solution
వెస్ట్‌బ్యాంక్, గాజాస్ట్రిప్ ప్రాంతాల్లో
పాలస్తీనా సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుని, 1967కు ముందు ఇజ్రాయెల్ సరిహద్దులను
గుర్తించి, పాలస్తీనా శరణార్థులను అక్కడ వదిలిపెట్టాలని హమాస్ డిమాండ్ చేసింది. ఆ
ప్రతిపాదనలు పూర్తిగా నెరవేరితే హమాస్ పూర్తిగా రద్దయిపోతుందని ఆ సంస్థ నాయకుడు
ఖలీల్ అల్ హయ్యా చెప్పారు.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఒక మీడియా సంస్థతో
మాట్లాడుతూ ఖలీల్ అల్ హయ్యా ‘‘ఆక్రమణదారులకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజల అనుభవాలను
చూస్తే స్వాతంత్ర్యం, హక్కులు, రాజ్యాలూ సంపాదించుకున్నాక ఆ పోరాటయోధులు ఏమయ్యారు?
వాళ్ళు రాజకీయ పార్టీలుగా మారారు, తమ సైన్యాలను వారు ఎప్పుడూ సమర్థించుకుంటూ
వచ్చారు’’ అని చెప్పుకొచ్చారు.
అయితే రెండు రాజ్యాల పరిష్కారానికి ఇజ్రాయెల్
ఒఫ్పుకుంటే హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ ముగిసిపోతుందని కానీ, లేక ఇజ్రాయెల్‌ను
సమూలంగా ధ్వంసం చేయాలన్న తమ లక్ష్యాన్ని ఉపసంహరించుకుంటామని కానీ ఖలీల్ హామీ
ఇవ్వలేదు. అయితే ఆ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు. 1967
అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఓడిపోయాక తమ భూభాగం నుంచి పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు
చేయడాన్ని ఇజ్రాయెల్ నేటికీ వ్యతిరేకిస్తూనే ఉంది. అక్కణ్ణుంచి తమపై దాడులు
చేస్తున్న హమాస్ ఉగ్రవాద సంస్థను తుదముట్టించాలని ఇజ్రాయెల్ పట్టుదలగా ఉంది.
దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనను ఇజ్రాయెల్ ఒప్పుకునే అవకాశమే లేదు.
అలాగే, 2007లో పాలస్తీనా పార్లమెంటరీ ఎన్నికల్లో
గెలిచాక గాజా ప్రాంతాన్ని హమాస్ సంస్థ ఆక్రమించుకోడంపై అటు ఇజ్రాయెల్, ఇటు
పాలస్తీనా ఎవరూ స్పందించలేదు. గాజా ప్రాంతాన్ని హమాస్ ఆక్రమించుకున్నాక పాలస్తీనా
చేతిలో వెస్ట్‌బ్యాంక్‌లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే మిగిలాయి. వాటిలోనూ
చాలాభాగాలు ఇజ్రాయెల్ అధీనంలోనే ఉన్నాయి.
ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా ఏర్పాటును ఒప్పుకునే
విషయంలో హమాస్ కొన్నిసార్లు సానుకూలంగా స్పందించి ఉండవచ్చు. కానీ అధికారికంగా
మాత్రం పాలస్తీనా నుంచి ఇజ్రాయెల్‌ను పూర్తిగా విముక్తం చేయాలన్న డిమాండ్‌ను హమాస్
వ్యతిరేకిస్తూనే ఉంది అని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.
తాజాగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్‌కు
చెందిన సుమారు పాతిక బెటాలియన్లలో గరిష్ఠభాగాన్ని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్
ప్రకటించుకుంది. కానీ నాలుగు బెటాలియన్లు మాత్రం రఫాలో చిక్కుకునిపోయాయి. హమాస్
అనేది పాలస్తీనా ఉగ్రవాద సంస్థ అనీ, దాన్ని సమూలంగా ఓడించాలంటే రఫా నగరంపై దాడి
చేసి దాన్ని ఆక్రమించుకోవడం చాలా ముఖ్యమనీ ఇజ్రాయెల్ వాదిస్తోంది.
రఫా ఆపరేషన్ లాంటి దాడులతో హమాస్‌ను ధ్వంసం
చేయడం సాధ్యం కాదని అల్ హయ్యా చెప్పుకొచ్చారు. గాజా బైట రాజకీయ నాయకత్వానికీ, లోపల
సైనిక నాయకత్వానికీ మధ్య కమ్యూనికేషన్ యుద్ధం వల్ల ఏమాత్రం దెబ్బతినలేదని ఆయన
వివరించారు. ‘‘హమాస్ మొత్తం సామర్థ్యంలో కనీసం 20శాతాన్నయినా ఇజ్రాయెల్ దళాలు
ధ్వంసం చేయలేకపోయాయి. అది యుద్ధక్షేత్రంలో కావచ్చు లేక మానవ వనరుల రూపంలో కావచ్చు.
వారు హమాస్‌ను అంతం చేయలేని పక్షంలో పరిష్కారమేమిటి? అది, ఏకాభిప్రాయం సాధించడమే’’
అని ఖలీల్ చెప్పారు.